వేములవాడ, వెలుగు: -రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన వేములవాడ ఎమ్మెల్యే, విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇండ్ల పనులను పరిశీలిస్తుండగా బేస్‌మెంట్ కుంగిపోవడంతో భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పక్కకు తీసుకొచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో 2019లో 144 డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేశారు. 2020 జులై 26న భారీ వర్షాలకు పిల్లర్ బెడ్స్ కుంగిపోయాయి. ఆ తరువాత పనులు ప్రారంభించినా, నాసిరకంగా పనులు జరుగుతున్నాయని అప్పట్లో ప్రతిపక్ష నేతలు నిలదీయడం, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్లీ పనులు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో వాటిని పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్, విప్‌తో పాటు ఆఫీసర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో వెళ్లడంతో బేస్‌మెంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అన్నీ నాసిరకం పనులే జరిగాయని విమర్శించారు.
నాసిరకం పనులపై గతంలో తాము అందోళనలు చేపట్టామని గుర్తు చేశారు. బేస్‌మెంట్ పరిశీలిస్తుండగానే కూలిపోవడం ఏమిటని ప్రశ్నించారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి కడుతుండగానే మూడు సార్లు కూలిపోయిందని, కాళేశ్వరం పరిస్థితి అలాగే ఉందన్నారు. కమీషన్ల కోసం నాసిరకంగా కట్టడాలు నిర్మించి అక్రమార్జనకు తెర లేపారన్నారు.
