బాల్క సుమన్ క్షమాపణ చెప్పాల్సిందే: జర్నలిస్టులు

బాల్క సుమన్ క్షమాపణ చెప్పాల్సిందే: జర్నలిస్టులు

జన్నారం, వెలుగు: జర్నలిస్టులపై అనుచిత వాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తు జన్నారం ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీల లీడర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మొయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిలా పనిచేస్తున్న జర్నలిస్టులపై అహంకారంతో వాఖ్యలు చేసిన బాల్క సుమన్​ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని రాస్తారోకోలో పాల్గొన్న ఆఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు.

ఎస్ఐ సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని జర్నలిస్టులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ చిలువేరి నర్సయ్య, కాంగ్రెస్, బీజేపీ మండల ప్రెసిడెంట్లు ముజాఫర్ ఆలీఖాన్, గోలి చందు, సీపీఐ మండల జనరల్ సెక్రెటరీ దాసరి తిరుపతి, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మోహన్ రెడ్డి, ముత్యం రాజన్న, సయ్యద్ ఫసిఉల్లా, బినవేని రాజన్న, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.

వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి

నస్పూర్: జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నస్పూర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్​లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ఎమ్మెల్యే చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్ర
మంలో రాజ్ కుమార్, నారాయణరెడ్డి, రామకృష్ణ, వైద్య శ్రీనివాస్, కె.శ్రీనివాస్, సమ్మయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిలో ఆందోళన

కోల్ బెల్ట్: జర్నలిస్టులపై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మందమర్రిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం సాయంత్రం మందమర్రి-–మంచిర్యాల నేషనల్ హైవేలోని క్యాతనపల్లి క్రాస్ రోడ్ వద్ద స్థానిక పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద  జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

జర్నలిస్టులపై దాడి..

క్యాతనపల్లి క్రాస్ రోడ్ వద్ద జర్నలిస్టులు నిరసన కొనసాగిస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులమని, ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయొద్దంటూ పాత్రికేయులపై దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అకారణంగా తమపై ఇద్దరు యువకులు దాడి చేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పాత్రికేయులు మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. జర్నలిస్టులపై దాడిని ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఖండించారు.