
"నేను గవర్నర్ నే కాదు.. ముందు అమ్మను, గైనకాలజిస్టును" అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ‘బాలల హక్కులు, తెలంగాణలో సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. విద్యా సంస్థల్లో బాలికలు లైంగిక వేధింపుల బారినపడుతుండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు.
పిల్లలను సవాళ్లు ఎదుర్కొనేలా సన్నద్ధం చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. బాలికలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ‘‘ పిల్లల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది..మన అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకూడదు’’ అని అన్నారు. కార్యక్రమంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కానూంగో, భారత్ నీతి వ్యవస్థాపకుడు మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.