- పట్టువస్త్రాలు సమర్పించినగవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
- రాజలాంఛనాలతో స్వామికి
- ఆభరణాల అలంకరణ పాల్గొన్న మంత్రి తుమ్మల
భద్రాచలం, వెలుగు: భద్రాద్రిలో శ్రీరామ మహాపట్టాభిషేకం శనివారం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా హాజరై ప్రభుత్వం తరుపున రాజవస్త్రాలను సమర్పించారు. పట్టాభిషేకం ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. రాజలాంఛనాలతో ఒక్కో ఆభరణాన్ని అలంకరించారు. నేడు స్వామికి మహదాశీర్వచనం నిర్వహించనున్నారు.
రాజలాంఛనాలతో..
భద్రాద్రి రామయ్యకు మహాపట్టాభిషేకం భక్త జన జేజేల మధ్య వైభవంగా సాగింది. రాజలాంఛనాలతో జరిగిన క్రతువును భక్తజనం తిలకించి పులకించింది. కిరీటధారణతో పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత సముద్ర నదీ జలాల కలశ ప్రోక్షణ నిర్వహించారు. వేదపండితుల పారాయణం, 8 మంది వైదిక మంత్రుల నేతృత్వంలో జరిగింది. కల్యాణ రాముడికి మహా పట్టాభిషేకాన్ని మిథిలా ప్రాంగణంలో భక్తజన కోలాహలం మధ్య నిర్వహించారు. స్వామి వారిని పట్టాభిషేక మండపానికి మంగళశాయిద్యాలు, భక్తుల కోలాటాల మధ్య తీసుకుని వచ్చారు. రాజలాంఛనాలతో వశిష్ట, వాల్మీకీ, విశ్వామిత్రుని స్థానాల్లో వేదపండితులు కూర్చుని పట్టాభిషేకాన్ని ప్రారంభించారు. పట్టాభిషేక క్రతువులో భాగంగా ఒక్కో ఆభరణాన్ని స్వామివారికి అలంకరించారు. శ్రీరామ బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడ లక్ష్మణస్వామికి సమర్పించారు. చామరం, బంగారు ఛత్రం, దుష్ట శిక్షణ కోసం రాజఖడ్గాన్ని రామయ్యకు అందజేశారు. పట్టాభిషేక ముగింపుగా సామ్రాట్‍కిరీటాన్ని రామయ్యకు ధరింప చేశారు. గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సీతారాములకు రాజ వస్త్రాలను సమర్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భక్తరామదాసు వారసులు, త్రిదండి చినజీయర్‌స్వామి తరుపున జీయర్ మఠం నుంచి, అహోబిల మఠాధిపతులు, ఉత్తరాది, కంచి కామకోటి పీఠం, రాజా తూము లక్ష్మీనర్సింహదాసు వారసులు పట్టువస్త్రాలు పట్టాభిరామునికి సమర్పించారు. రాత్రి పట్టాభిరాముడికి రథోత్సవం జరిగింది. పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన రథంలో సీతారామచంద్రస్వామిని అధిష్టించి రథాన్ని లాగారు. ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎండోమెంట్ కమిషనర్ హన్మంత్‌రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో బి.రాహుల్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) క్షేత్రంలో శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీరాముడి పట్టాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం సీతాసమేత శ్రీరాముడి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి శ్రీరామ పట్టాభిషేకాన్ని చేశారు. రాత్రి సీతారాముల డోలోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు.
వెల్లివిరిసిన మత సామరస్యం
ఇల్లెందు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని హజరత్ నాగుల్ మీరా చిల్లా దర్గాలో సీతారామ చంద్రస్వామి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పట్టాభిషేకాన్ని దర్గా నిర్వాహకులు జరిపించారు. దీంతో దర్గాలో మత సామరస్యం వెల్లి విరిసింది. శ్రీరాముడికి కిరీటం, ధనస్సు, బాణం, గద సమర్పించారు.
