ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి..కష్టాలను ఎదుర్కొంటేనే జీవితాన్ని ఎంజాయ్‌‌ చేయగలం : గవర్నర జిష్ణుదేవ్‌‌ వర్మ

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి..కష్టాలను ఎదుర్కొంటేనే జీవితాన్ని ఎంజాయ్‌‌ చేయగలం : గవర్నర జిష్ణుదేవ్‌‌ వర్మ

హనుమకొండ/హసన్‌‌పర్తి, వెలుగు : జీవితంలో ఎదురైన అపజయాలను విజయానికి మెట్లుగా మార్చుకోవాలని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూచించారు. ఓటమి ఎదురైతే భయపడకుండా.. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ఐఐసీటీ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి పీహెచ్‌‌డీలు, గోల్డ్‌‌మెడల్స్‌‌ అందించారు. అనంతరం గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌వర్మ మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణలోనే మహత్తర విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. నేటి యువత కొత్త పరిశోధనలతో రీసెర్చ్, డెవలప్‌‌మెంట్‌‌కు మైలురాళ్లను నిర్దేశిస్తున్నారన్నారు. 

జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా ఏఐ, సైబర్‌‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌‌, న్యూట్రిషన్‌‌ సైన్స్‌‌ వంటి కోర్సులను కేయూలో ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ప్రధాని సూచించిన క్రిటికల్‌‌ థింకింగ్‌‌, క్రియేటివిటి, కొలాబరేషన్‌‌, క్యురియాసిటీ, కమ్యూనికేషన్‌‌... 21వ శతాబ్దపు దిక్సూచీలన్నారు. హైదరాబాద్‌‌ ఐఐసీటీ డైరెక్టర్, శాంతి స్వరూప్‌‌ భట్నాగర్ అవార్డు గ్రహీత డాక్టర్‌‌ డి.శ్రీనివాస్‌‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు గ్రామీణ ప్రాంతం, తెలుగు మీడియం అడ్డంకి కాదన్నారు. తాను పేపర్‌‌ బాయ్‌‌ నుంచే జీవితాన్ని స్టార్ట్‌‌ చేశానని చెప్పారు. పరిశోధనల ద్వారానే బలమైన దేశం తయారవుతుందని, వికసిత్ భారత్‌‌ దిశగా ఆలోచించాలని సూచించారు. 

టీబీ ముక్త్‌‌ భారత్‌‌పై మీటింగ్‌‌

టీబీ నిర్మూలనకు కలెక్టర్లు, రెడ్‌‌ క్రాస్‌‌ సొసైటీ సభ్యులు ప్రణాళికతో ముందుకెళ్లాలని గవర్నర్, రెడ్‌‌ క్రాస్‌‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్‌‌ వర్మ సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌‌లో మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని టీబీ ముక్త్‌‌ భారత్‌‌ అభియాన్‌‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. విస్తృతంగా క్యాంప్‌‌లు నిర్వహించి టీబీ కేసులను గుర్తించాలని, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని సూచించారు.