దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయండి: నారాయణ

దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయండి: నారాయణ

దేశానికి ఉపయోగపడని  గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ..కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వంతో జరుగుతున్న  వివాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్లను తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, తాజాగా తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేసేలా గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఒక ఆయుధంలాగా ఉపయోగిస్తు్న్నారని ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్రభుత్వం మధ్య కొన్ని విషయాల్లో వాగ్వాదం జరుగుతుందన్నారు. 

శనివారం ప్రధాని మోడీ రామగుండంలో పర్యటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నారాయణ అన్నారు. విభజన హామీలను అమలు చేయలేదని బీజేపీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. అందుకే ప్రధాని పర్యటనను నిరసిస్తూ నల్ల జెండాలతో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. అన్నీ రాజకీయ పార్టీలతో కూడిన యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.  తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని..దీన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడలేకపోతుందన్నారు.  ప్రస్తుతం దేశంలో థర్డ ఫ్రంట్  ప్రస్తావన లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా వారితో కలిసి నడిచేందుకు  సిద్ధంగా ఉన్నామని చెప్పారు.