నియంతృత్వానికి..చరమగీతం : గవర్నర్ తమిళిసై  

నియంతృత్వానికి..చరమగీతం : గవర్నర్ తమిళిసై  
  •  అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది
  • ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది: గవర్నర్ తమిళిసై  
  • ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది
  • వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నం 
  • మాట నిలబెట్టుకుంటం.. రుణమాఫీ చేస్తం
  • ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి  
  • పబ్లిక్ గార్డెన్స్​లో ఘనంగా రిపబ్లిక్ డే
  • జెండా ఎగురవేసిన గవర్నర్.. హాజరైన సీఎం రేవంత్ 

హైదరాబాద్, వెలుగు :  నియంతృత్వాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని గవర్నర్ తమిళిసై అన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని అన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని పబ్లిక్​ గార్డెన్స్​లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు సీఎం రేవంత్​రెడ్డి, సీఎస్​ శాంతికుమారి స్వాగతం పలికారు. 

అనంతరం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగినప్పుడు, ఆ పాలనకు చరమగీతం పాడే అవకాశం కూడా రాజ్యాంగం ప్రజలకు కల్పించిందని అన్నారు. ‘‘గడిచిన పదేండ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో పాలన సాగించారు. దాన్ని తెలంగాణ సమాజం సహించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా నియంతృత్వానికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అహంకారం, నియంతృత్వం చెల్లదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది” అని పేర్కొన్నారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, వ్యవస్థలు గాడి తప్పాయని.. వాటన్నింటినీ సంస్కరించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముఖులై తమ పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం” అని అన్నారు. 

రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నం..  

గత పాలనలో ఉపాధి, ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని గవర్నర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సారథులైన యువత విషయంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ జరుగుతున్నది. అది పూర్తి కాగానే ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు” అని అన్నారు. రైతులకు ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.  ‘‘24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.

వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యాచరణ మొదలుపెట్టం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశాం. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. రైతులకు ఇచ్చిన మాటను నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటాం” అని తెలిపారు.

గ్యారంటీల అమలుకు కార్యాచరణ మొదలైంది.. 

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని గవర్నర్ అన్నారు. ‘‘ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 11 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

వీటిలో ఐదు గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు ఉన్నాయి. ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను శాఖల వారీగా విభజించి, కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్ధమవుతున్నది” అని పేర్కొన్నారు. ‘‘దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం పాల్గొని రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,232 కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం. ఈ ప్రయత్నం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు మేలు చేస్తుంది” అని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

అన్ని వ్యవస్థలను పునర్నిర్మిస్తున్నం.. 

ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ అన్నారు. ‘‘గత పదేండ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఈ ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించు కుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం” అని చెప్పారు. ‘‘రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైంది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉంది.

ఇందుకు గర్వంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టిందని.. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందన్నారు.