
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అందులో భాగంగా పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న, ఆస్కార్‌లకు నామినేట్ అయిన 'నాటు నాటు' పాట స్వరకర్త & గీత రచయిత ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లను గవర్నర్ తమిళిసై సత్కరించారు. ఈ వేడుకల్లో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ తర్వాత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ రాష్ట్రం ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూనే పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు.. అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకారం అందిస్తోందని .. రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.