మల్లన్నకు మొక్కులు.. భైరాన్​పల్లి అమరులకు నివాళులు

మల్లన్నకు మొక్కులు.. భైరాన్​పల్లి అమరులకు నివాళులు

సిద్దిపేట/చేర్యాల/కొమురవెల్లి, వెలుగు : సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా పర్యటించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆమె చేరుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ అధికారులు పూర్ణ కుంబంతో గవర్నర్​కు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ అర్చకులు ఆమెకు శాలువ కప్పి సన్మానించారు.  ప్రసాదం, స్వామివారి ఫొటోను అందజేశారు. అనంతరం 11.15 నిమిషాలకు ఆమె భైరాన్ పల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. జిల్లాలో దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. తమిళిసై సౌందర రాజన్​ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చినా జిల్లా కలెక్టర్, ఇన్​చార్జి సీపీతో పాటు జిల్లా అధికారులు ఎవరూ పాల్గొన లేదు. పర్యటన అనంతరం గవర్నర్​ హైదరాబాద్ వెళ్తుండగా చేర్యాల పట్టణంలోని నిరుపేద యువతి మల్లిగారి సంధ్య కోరిక మేరకు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె సమస్యలు తెలుసుకున్నారు. తనకు ఇల్లు మంజూరయ్యేలా చూడాలని సంధ్య కోరగా అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 

అమరుల కుటుంబాలతో మమేకమై..
గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ భైరాన్ పల్లి లో అమరులకుటుంబ సభ్యులతో మమేకమయ్యారు. వారిని శాలువాతో సన్మానించి, మెమెంటోలను అందజేసి వారితో కలసి కూర్చుని మాట్లాడారు. వారిలో కొందరితో ‘మీ పేరు ఏమిటి’  అంటూ  తెలుగులో అడిగారు. మొదట ఆమె భైరాన్ పల్లికి చేరుకోగానే విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత అమర వీరుల స్థూపానికి, గ్రామంలోని చారిత్రక బురుజు వద్ద అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల  సందర్భంగా రాజ్ భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో భైరాన్ పల్లి గ్రామానికి చెందిన అఖిల అనే  విద్యార్థిని ద్వారా గ్రామ చరిత్రను తెలుసుకుని, ఆమె విజ్ఞప్తి మేరకు గ్రామాన్ని సందర్శించినట్టు వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, వీర భైరాన్ పల్లి ఫ్రీడమ్ ఫైటర్ సంఘం అధ్యక్షుడు ఆగంరెడ్డి తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వినతిపత్రాల స్వీకరణ
పలు సమస్యలపై ప్రజలిచ్చిన వినతులను గవర్నర్​ స్వీకరించారు. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు, దాసారం గుట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం నేతలు, అమరుల కుటుంబాలకు, స్వతంత్ర సమరయోధుల పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రాలు సమర్పించారు. వీటిపై ఆమె స్పందిస్తూ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు సరికాదు.. 
కొమురవెల్లి/సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర గవర్నర్ కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం కొమురవెల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట కలెక్టర్, సీపీ రాకపోవడానికి ప్రభుత్వమే కారణమాన్నారు.  గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం రాజ్యాంగాన్ని అవమానించేలా ఉందని, దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్ గౌడ్, మండల అధ్యక్షుడు దండ్యాల వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బోడుగం కృష్ణారెడ్డి, పంజాల మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు కరుణాకర్, రాజు చారి ఉన్నారు.