
పోషకాహార ఆవశ్యకతపై మరింత అవగాహన పెంచాలని, పోషకాహార లోపాలను నివారించేందుకు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ పోషకాహార మాసం కార్యక్రమంలో గవర్నర్ ముఖ్యఅతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహార ఆవశ్యకత అవగాహనను పెంచడానికి జరుగుతున్న ప్రజా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలిపారు. పోషన్ అభియాన్ అనే పథకం ద్వారా 9 వేల కోట్ల రూపాయల కేటాయింపు ద్వారా 2022 వ సంవత్సరం వరకు పోషకాహార లోప రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోడీ సంకల్పించినట్టు ఆమె తెలిపారు.
సరైన పోషకాహారంతో మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని గవర్నర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కోవిడ్ నిరోధక ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జంక్ పుడ్ ద్వారా ఆనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. దేశానికి ఆహార భద్రతోపాటు, పోషకాహార భద్రత కూడా ఉండాలని గవర్నర్ తమిళిసై చెప్పారు