
తాడ్వాయి, వెలుగు: ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్న తమ బిడ్డను కాలేజీలో చేర్పించేందుకు డబ్బులు లేక గిరిజన దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బిడ్డ కష్టపడి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్నా జాయిన్ చేసేందుకు డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థం కాక తల్లడిల్లుతున్నరు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన మండపు మల్లేశం, సారక్క దంపతుల కొడుకు లక్ష్మీరాజు నీట్లో 420 మార్కులు సాధించాడు. రామగుండం సింగరేణి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) లో ఎంబీబీఎస్ సీటు లభించింది. కాలేజీ, ట్యూషన్ ఫీజు, తదితర ఖర్చుల కోసం రూ.1.50 లక్షలు అవుతాయని అధికారులు తెలపడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు సర్దుబాటు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. తమ కొడుకు ఎంబీబీఎస్ చదివేందుకు దాతలు సహకరించాలని పేరెంట్స్ ప్రాధేయపడుతున్నారు.
మెడిసిన్ పూర్తి చేసేందుకు టీచర్ సాయం..
సుల్తానాబాద్: ఓ నిరుపేద విద్యార్థిని ఎంబీబీఎస్లో సీటు దక్కించుకోగా, ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ భరించేందుకు ఓ ఉపాధ్యాయుడు ముందుకువచ్చాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మెరుగు స్వామి రైస్ మిల్లులో ఆపరేటర్ గా పని చేస్తుండగా, అతని రెండో కూతరు అక్షయ నర్సంపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. కాలేజీలో చేరి మెడిసిన్ పూర్తి చేసే ఆర్థిక స్థోమత
లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ జడ్పీ హైస్కూల్లో టెన్త్లో చదువు చెప్పిన ఇంగ్లీష్ టీచర్ మగ్గిడి విజయరావు విషయం తెలుసుకొని, అక్షయ మెడిసిన్ పూర్తి చేసేంత వరకు ఖర్చు భరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. శనివారం అడ్మిషన్ ఫీజు కూడా చెల్లించారు. అక్షయను టీచర్లు విజయరావు, గీతాదేవి, ఎంఈవో రాజయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.