మా అమ్మ చనిపోయినా పలకరించలె

మా అమ్మ చనిపోయినా పలకరించలె
  • కేసీఆర్​ కనీసం ఫోన్​ కూడా చేయలేదు.. 
  • గవర్నర్​ తమిళిసై ఆవేదన
  • రాష్ట్రంలో డ్రగ్స్​తో యువత నాశనమైతున్నరు.. 
  • ఈ విషయంలో ఓ తల్లిగా బాధపడుతున్న
  • ప్రభుత్వ హాస్పిటళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది.. 
  • యూనివర్సిటీలను పట్టించుకుంటలేరని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్​భవన్​లో తన తల్లి చనిపోతే సీఎం కేసీఆర్‌‌‌‌ చూడడానికి కూడా రాలేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అమ్మ చనిపోయిన చేదు వార్తను రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కార్యాలయాలకు నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్పాను. రాష్ట్రపతి వెంటనే ఫోన్ చేసి ఓదార్చారు. విదేశాల్లో ఉన్న ప్రధాని సాయంత్రానికి ఫోన్​లో పరామర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం రాజ్ భవన్​లో మా అమ్మ భౌతిక కాయాన్ని చూడడానికి రాలేదు. కనీసం ఆయన ఫోన్​లో కూడా పలకరించలేదు. అమ్మ భౌతికకాయాన్ని తమిళనాడుకు తరలించేందుకు స్పెషల్ ఫ్లైట్ అడిగినా ఇవ్వలేదు. ఎంతో బాధపడ్డాను’’ అని గవర్నర్​ తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు. 

తాను కేసీఆర్​ను అన్నగా భావిస్తానని,  ‘అన్న’ అని  పిలుస్తానని చెప్పారు. కరుణానిధి, జయలలిత, మమతా బెనర్జీ లాంటి సీఎంలు గవర్నర్లను విభేదించినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారని గుర్తుచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రస్తావించారు. అనంతరం తెలంగాణ భవన్ లోని శబరీ బ్లాక్ లో  మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రధాని మోడీ, అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కేసు, మితిమీరిన అవినీతిపై వాళ్లకు రిపోర్టు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌తో యువత నాశనం అవుతున్నారని, ఈ విషయంలో ఓ తల్లిగా బాధ పడుతున్నానని.. అదే రిపోర్టును ప్రధానికి ఇచ్చినట్లు వివరించారు.  తెలంగాణలో ప్రభుత్వ హాస్పిటళ్ల  పరిస్థితి దయనీయంగా ఉందని గవర్నర్​ అన్నారు. యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌‌‌‌‌‌‌‌గా తనకుందని, కానీ.. ఆ పని చేయనని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు ఎలాంటి కోపం లేదని గవర్నర్  స్పష్టం చేశారు. 

మహిళగానైనా గౌరవించరా?
‘‘రాష్ట్ర గవర్నర్ హోదాలో కాకపోయినా... ఒక సాధారణ వ్యక్తిగా, అందులో మహిళగా,  తెలంగాణ సోదరిగా నాకు గౌరవం ఇవ్వాలా.. వద్దా? తెలంగాణ స్టేట్ కు రిచ్ కల్చర్ ఉంది.  ప్రతి ఒక్కరూ బ్రదర్ అండ్ సిస్టర్ లా కలిసి ఉంటారు. కానీ, ఒక మహిళగా నన్ను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం సరైందా? అనేది నా ప్రశ్న. నావైపు నుంచి నేను ఎన్నోసార్లు సీఎం, ప్రభుత్వానికి ఆహ్వానం పంపినా, కమ్యూనికేట్ చేసినా...  వాళ్లు రాలేదు, స్పందించలేదు’’ అని గవర్నర్ తమిళిసై తెలిపారు. తాను ఏ అంశాల్లో రాజకీయం చేస్తున్నానో ప్రభుత్వ పెద్దలు చెప్తే... వారికి ఆన్సర్  ఇస్తానన్నారు. ‘‘రాజ్ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి. సీఎం, మంత్రులు, చీఫ్ సెక్రటరీ రావొచ్చు. సమస్య ఏంటో నాకు వివరించొచ్చు. ప్రెస్ తో గవర్నర్ రాజకీయం చేస్తున్నారని మాట్లాడడం సరికాదు. వచ్చి ప్రశ్నించండి. ఇది మా ప్రాబ్లం అని చెప్పండి. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా’’ అని స్పష్టం చేశారు.

బీజేపీ కార్యకర్త అని ఎట్ల అంటరు?
ఎలాంటి సాక్ష్యం లేకుండా తనను బీజేపీ కార్యకర్త అని ఎలా అంటారని గవర్నర్​ సీరియస్ అయ్యారు. ‘‘నేనేమైనా బీజేపీ కార్యక్రమానికి వెళ్లి జెండా ఎగురవేశానా? నేనేమైనా అక్కడి వెళ్లానా? నాకేమైనా బీజేపీ బెటాలియన్ కల్పించిందా?’’ అని ప్రశ్నించారు. గవర్నర్ హోదాలో కాకపోయినా..  ఒక సాధారణ భక్తురాలిగా తన భర్తతో కలిసి యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దర్శనం కోసం వెళ్లినట్లు చెప్పారు. అయితే, ప్రభుత్వానికి వచ్చిన ఈగోపై తాను ఏమాత్రం బాధపడడం లేదన్నారు. యాదాద్రికి వెళ్లి వచ్చిన మరుసటిరోజు  గవర్నర్ ను ఆహ్వానించడానికి అధికారులు రాలేదని మీడియాలో కూడా వచ్చిందని గుర్తుచేశారు. ‘‘రాజ్ భవన్-, ప్రగతి భవన్ మధ్య దూరం, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఓపెన్ సీక్రెట్. ఇదే అంశంపై మళ్లీ మళ్లీ ఎందుకు స్పందించడం. ఈ అంశాన్ని ప్రజా క్షేత్రంలో పెట్టాను. నా విషయంలో జరిగింది... కరెక్టా?  కాదా? అనేది  ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఏదీ దాచడం లేదు’’ అని గవర్నర్​ తెలిపారు. 

ఇదేనా గవర్నర్ కు మీరిచ్చిన గౌరవం?
గవర్నర్ కు గౌరవం ఇస్తున్నామని మంత్రి (జగదీశ్​రెడ్డి) చెప్పింది నిజమైతే... ఎందుకు రాజ్​భవన్​లో రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ పెద్దలు రాలేదని గవర్నర్​ తమిళిసై ప్రశ్నించారు. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాజ్​భవన్​లోని ఉగాది వేడుకలకు ఆహ్వానం పంపిస్తే రెస్సాన్స్ ఎందుకు రాలేదు. సామ్మక్క, సారక్క పండుగకు నన్ను ఎందుకు పిలువలేదు. ట్రైబల్ మినిస్ట్రీ సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీ నన్ను ఎందుకు రిసీవ్ చేసుకునేందుకు రాలేదు? ఇదేనా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం? ఇది తమిళి సై కోసం కాదు.. ఆఫీసు ఆఫ్ గవర్నర్ కోసం రెస్పెక్ట్ ఇవ్వుమంటున్న. ఎవరైనా గవర్నర్ గా ఉండొచ్చు.. ఆ పోస్ట్ కు మనం గౌరవం ఇవ్వాల్సిందే’’ అని స్పష్టం చేశారు. గవర్నర్ కు కల్పించిన ప్రొటోకాల్స్ పై గడిచిన నాలుగు, ఐదు నెలల్లో వచ్చిన మీడియా కథనాలు చదివితే అంతా అర్థమవుతుందని చెప్పారు. సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లినప్పుడు గవర్నర్ గా తనకు ప్రొటోకాల్ కల్పించడకపోవడంపై ఎమ్మెల్యే సీతక్క ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘‘నేను ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ఏ అధికారి కూడా నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఇది ఓపెన్ గా తెలిసిన విషయమే. అలాంటప్పుడు రాష్ట్ర మంత్రులు గవర్నర్ కు అన్ని విధాలుగా ప్రొటోకాల్ కల్పిస్తున్నట్లు ఎలా చెప్తారు?” అని ప్రశ్నించారు. 

నేనేమీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు
‘‘రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు దూరం ఎందుకు పెరిగిందో నాకు తెలియదు. ఈ విషయాన్ని వాళ్లనే అడగాలి” అని గవర్నర్​ అన్నారు. రాజ్యాంగ హోదాలో ప్రభుత్వంపై తానేమీ విమర్శలు చేయడం లేదన్నారు. ‘‘మీడియా ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తున్నాను. నా స్పీచ్ లో ఎవర్నీ టార్గెట్ చేయడం లేదు. బుధవారం చేసిన వ్యాఖ్యల్లో కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కానీ, గవర్నర్ ఆఫీసుకు అవమానం జరుగుతుందని మాత్రమే చెప్పాను. ఈ అంశాలను బహిరంగంగానే తెలంగాణ ప్రజలకు తెలుపుతున్నా’’ అని పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్  రెసిడెంట్​ కమిషనర్​ (ఆర్సీ) కూడా తనకు వెల్ కం చేయలేదని అన్నారు. తాను వచ్చి రెండు రోజులవుతున్నా కనీసం తాను స్టే చేస్తున్న శబరీ బ్లాక్ వైపు కూడా రాలేదని తెలిపారు.

మంత్రుల విమర్శలు వింటుంటే నవ్వస్తున్నది
‘‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ టెంపుల్ అయిన లక్ష్మీ నరసింహా స్వామి దర్శనానికి వెళ్తే, బీజేపీ పర్సన్ అని నాపై ముద్ర ఎలా వేస్తారు? ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటే నాకు నవ్వస్తున్నది’ అని గవర్నర్​ అన్నారు. తాను ఎక్కడ రాజకీయాలు చేశానో చెప్పాలని, రెండున్నరేండ్ల కాలంలో రాజకీయ పార్టీలకు తానిచ్చిన అపాయింట్​మెంట్ల  జాబితా ఓపెన్ గా ఉందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ గా అన్ని రాజకీయ పార్టీల నేతల్ని కలిశానన్నారు. ‘‘నేను చాలా ఫ్రెండ్లీ పర్సన్​ని. నేను తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను. అందువల్ల అన్నీ అంశాలను తెలంగాణ ప్రజలకే వదిస్తున్నాను’’ అని స్పష్టం చేశారు. తాను తెలంగాణ సిస్టర్​ను అని, తెలంగాణ రాజ్ భవన్ లో కూర్చుంటానని,  తన విధానంలో ఏమైనా తప్పు ఉంటే చెప్పాలని ఆమె కోరారు. 

ఎమ్మెల్సీ పోస్టుకు కౌశిక్​రెడ్డికి బదులు కరోనా వారియర్స్​ కనిపించలేదా?
దాదాపు 10 నెలలుగా రాజ్ భవన్‌‌‌‌ను అవమానిస్తున్నారని, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్​ నుంచి పరిస్థితి మరింత దిగజారిందని గవర్నర్​ తమిళిసై అన్నారు. కౌశిక్ రెడ్డి నామినేషన్ పై సంతృప్తి చెందకపోవడం వల్లే వ్యతిరేకించినట్లు చెప్పారు. కరోనా టైంలో ఎంతో మంది సేవ చేశారని, గవర్నర్​ కోటాలోని సేవారంగానికి చెందిన ఆ ఎమ్మెల్సీ పోస్టుకు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, ఇతర విభాగానికి చెందిన వారెవరకు సీఎంకు కన్పించలేదా? అని అన్నారు. 

ట్రైన్, రోడ్డు మార్గాన్ని ప్రభుత్వం కల్పించింది
‘‘ట్రైన్, రోడ్డు ప్రయాణ సౌకర్యాన్ని (మోడ్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ ) రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా, అందకపోయినా ప్రజల కోసం నా డ్యూటీని ఎంజాయ్ చేస్తాను. నేను నా తెలంగాణ ప్రజల్ని, నా సోదరీసోదరులైన గిరిజన బిడ్డలను చూడడానికి వెళ్తున్నా’’ అని గవర్నర్​ పేర్కొన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో  భద్రాచలం ఆలయాన్ని దర్శించనున్నట్లు తెలిపారు. అయితే, పూర్తిగా ట్రైబల్ ఏరియా అయిన ఈ ప్రాంతంలో ట్రైన్, రోడ్డు మార్గంలో పర్యటించనున్నట్లు వివరించారు. ‘‘ఈనెల 10 న  భద్రాద్రి టెంపుల్‌కు వెళ్తా. 11 న శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొంటాను. అయితే, ట్రైబల్ ఏరియాలో చేపట్టనున్న ఈ టూర్ ట్రైన్, రోడ్డు మార్గంలో ఉంటుంది’’ అని అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తుందిగా... హెలికాప్టర్ ఉండగా, రోడ్డు మార్గంలో ఎందుకు ప్రయాణించాలని అనుకుంటు న్నారు?’’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన గవర్నర్.. ‘‘ఎందుకు ట్రైన్, రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తుందన్న ప్రశ్నను మీకే(మీడియాకే) వదిలేస్తున్నా’’ అంటూ పరోక్షంగా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమక్క, సారక్క జాతర, నాగర్ కర్నూల్ జిల్లాకు కూడా కేవలం రోడ్డు మార్గంలో వెళ్లిన అంశాన్ని గుర్తుచేశారు.