
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. తర్వాత అసెంబ్లీ, కౌన్సిల్ బీఏసీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సెషన్‌లో మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టేఅవకాశముంది. శనివారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ వేర్వేరుగా సమావేశమై.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతాయి. సోమవారం (ఈనెల 6న) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కౌన్సిల్‌లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి 2023 - 24 బడ్జెట్ ప్రవేశపెడుతారు. మరుసటి రోజు సెలవు ఇస్తారు. తర్వాత నుంచి బడ్జెట్‌పై చర్చ చేపడుతారు. అసెంబ్లీలో పద్దులపై చర్చించే సమయంలో కౌన్సిల్‌లో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక చేపట్టే అవకాశముంది. ఈనెల 13 వరకు సమావేశాలు కొనసాగే అవకాశముందని, అదే రోజు ఉభయ సభల్లో అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి, నిరవధిక వాయిదా వేసే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర బడ్జెట్‌ను కార్నర్ చేసేలా ప్రసంగాలు!
అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో 2023 -24 వార్షిక పద్దుతో పాటు ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సమయంలో కేంద్ర బడ్జెట్‌ను కార్నర్ చేసేలా అధికార పార్టీ సభ్యుల ప్రసంగాలు రూపొందిస్తున్నారు. ఈ సెషన్ ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు నిర్వహించే అవకాశముంది. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజులు సభ నడిచినా వాటిని వర్కింగ్ డేస్ కింద లెక్కించరు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అప్రాప్రియేషన్ బిల్లు వరకు ఆరు రోజులు సభ నడిపించే అవకాశముంది. టీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పుతో శాసనసభ పక్షం పేరు బీఆర్‌ఎస్ ఎల్పీగా మార్చారు. మూడేళ్ల పాటు కరోనా నిబంధనలతోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ దాదాపు జీరోకు వచ్చింది. దీంతో కరోనా నిబంధనలు లేకుండానే ఈ సెషన్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల కోసం కరోనా టైంలో ఏర్పాటు చేసిన అదనపు సీట్లను హౌస్‌లో అలాగే ఉంచారు.
5న రాష్ట్ర కేబినెట్ భేటీ
ఈ నెల 5వ తేదీ ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. రాష్ట్ర బడ్జెట్ పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనున్నది. ఆ తరువాతే సీఎం కేసీఆర్, మంత్రులు నాందేడ్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ నెల 6వ తేదీన అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ముందస్తుకు వెళ్తే ఇదే చివరి సెషన్!
ఈ ఏడాది మార్చి, మే నెలల్లో శాసనమండలిలో ఏడుగురు సభ్యుల కాలపరిమితి ముగియనుంది. ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, కె.నవీన్ కుమార్, రాజేశ్వర్ రావు, ఫారూక్ హుస్సేన్, అమీనుల్ హసన్ జాఫ్రీ, కాటేపల్లి జనార్దన్ పదవీ కాలం పూర్తి కానుంది. ఇందులో ఐదుగురు బీఆర్‌ఎస్, ఒకరు ఎంఐఎం, మరొకరు పీఆర్‌టీయూ నుంచి ఎన్నికయ్యారు. 2019లో మండలికి నామినేట్ చేసిన నవీన్ కుమార్‌కు రెన్యూవల్ ఖాయమనే చర్చ సాగుతోంది. వయోభారం రీత్యా కృష్ణారెడ్డికి మరో చాన్స్ రాకపోవచ్చు. హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానం మళ్లీ ఎంఐఎంకే కేటాయించే అవకాశముంది. పదవీకాలం పూర్తయ్యే వారిలో ఎవరికి రెన్యూవల్ లభిస్తుందనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. సెషన్ ముగిసిన తర్వాత ఆయా ఎమ్మెల్సీలను సత్కరించనున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్ అయ్యే అవకాశముంది. ఒకవేళ పూర్తికాలం అధికారంలో ఉంటే వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండనుంది.