రైతుకు పామాయిలే సిరుల పంట!

రైతుకు పామాయిలే సిరుల పంట!

ఆధునిక సేద్యపు సవాళ్లను అధిగమించి రైతుకు కాస్త ఊరట కలిగించే పంట పామాయిల్. ఆధునిక సేద్యపుదారులకు ఇదో చక్కని అవకాశం.  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విస్తారంగా పామాయిల్ సేద్యం జరుగుతోంది. గోద్రెజ్ లాంటి  కంపెనీల సహకారం సేద్యంలో అందుతోంది. ప్రభుత్వం కూడా 5 ఎకరాలలోపు పామాయిల్ సేద్యం చేసే రైతులకు ఎకరానికి రూ.30వేలు ఇన్​పుట్ సబ్సిడీ కూడా అందజేస్తున్నది. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి  రైతుకు ఈ పంటరక్షణ కలిగిస్తోంది. అతివృష్టి, అనావృష్టిని తట్టుకొని నిలబడగలిగిన ఏకైక సేద్యం పామాయిల్ అని చెప్పవచ్చు.

దళారీ వ్యాపార వ్యవస్థలో ధరలు హెచ్చుతగ్గులు ఉండి, తాలు, తారం, పుచ్చు, సచ్చు పేరుతో పంటదోపిడీకి పాల్పడతారు. కానీ పామాయిల్ పంటలో ఆ అవకాశం లేదు. పండిన పామాయిల్ ఫ్రూట్​ను నేరుగా ఆయిల్ ఫెడ్ సంస్థ గాని, కొన్ని మండలాల్లో దత్తత తీసుకుని పనిచేస్తున్న గోద్రేజ్ లాంటి విశ్వసనీయ కంపెనీలు నేరుగా  రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. ధరల నిలకడ కూడా ఉంటుంది. చిన్న సన్నకారు రైతుల నుండి ధనిక రైతుల వరకు ఈ పంటసేద్యం అనుకూలమైనది.  మొక్క నాటిన రెండేళ్ళ పాటు రైతు అంతర్ పంటకూడా సేద్యం చేసుకునే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే పెద్దగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడవలసిన అవసరం ఈ పంటకు లేదు! 

మూడేళ్ల కాలపరిమితిలో ఈ పంట ఫలసాయం రైతుకు అందుబాటులోకి వచ్చి ముప్పై ఏళ్లపాటునిరాటంకంగా  ఫలసాయం  అందజేస్తుంది. అంటేప్రతి ఏటా విత్తనాలు కొనుగోలు, నాటుకునే ఖర్చు ఈ పంటలో ఉండదు. ఈపంటకు క్రిమి,కీటకాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే! సూక్ష్మ రసాయనిక ఎరువులు బోరాన్, మెగ్నీషియం ఆరు నెలలకు ఒక పర్యాయం మొక్కకు అందించడం ద్వారా మొక్క ఎదుగుదల, పంట దిగుబడిలో అదిక ఫలసాయం వస్తుంది. ఈ పంటకు పశువుల ఎరువు వాడకం ఏరకంగా చూసినా శ్రేయోదాయకం. రసాయనిక ఎరువులు యూరియా,పొటాష్ తగిన మోతాదులో ఫలసాయం మొదలయ్యే సీజన్ బట్టి వాడకం మంచిది. తేమ వాతావరణం ఉన్న భూములు ఈపంట సేద్యంకు చాలా అనువైనవి.  

ప్రభుత్వ సబ్సిడీ

 డ్రిప్ పద్ధతిలో నీటి అందజేత శ్రేయస్కరం. 90శాతం సబ్సిడీ పైన ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ఈ డ్రిప్ సౌకర్యం రైతుల కు అందజేస్తుంది.కనుక డ్రిప్ సేద్యం ఏరకంగా నైనా పామాయిల్ కు సౌకర్యవంతమైన నీటి యాజమాన్య పద్దతి.పామాయిల్ తోటలో గడ్డి నిర్మూలన కొరకు ‘గ్లైపోసెట్’ లాంటి నిషేధిత మందులు ఎట్టి పరిస్థితిలో వాడరాదు. అధికంగా గడ్డి మందులవాడకం మొక్క పెరుగుదల, పంట దిగుబడి, నేల స్వభావంపై  ప్రభావం చూపుతుంది. కాస్తా ఎక్కువ సేద్యపు కమతాలు అంటే5ఎకరాల నుండి10ఎకరాలు ఉంటే గొర్రెలు పెంపకం యూనిట్ ద్వారా పామాయిల్ కలుపు సమస్యను కుత్రిమంగా నివారించుకోవచ్చును. పామాయిల్ సేద్యం లో స్వల్ప గడ్డి కూడా అవసరమే! ఎందుకంటే ఆడ, మగ పొత్తుల మీద పురుగు తిరిగి నప్పుడు మాత్రమే ఫలదీకరణం చెంది పంట వస్తుంది. కనుక ఒకరకమైన రెక్కలు  పురుగులు గడ్డి మీదనే ఎక్కువ పెరిగి తిరుగుతుంటాయి. 

కలుపు తక్కువే

పంట నాటిన నాల్గవ ఏడాది నుండి పూర్తిస్థాయిలో ఫలసాయం అందుతుంది. ఏడాది మొత్తం పామాయిల్ గెలలు వచ్చినప్పటికీ అన్నిచెట్లు ఒకే సమయంలో గెలలు ఇవ్వవు. ఏడాదిలో ఏదో ఒక సమయంలో ప్రతి పామాయిల్ చెట్టు ఫలసాయం వస్తుంది. పామాయిల్ చెట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. పీచు, మగ కంకులను తొలగించి చెట్టు పరిసరాల్లో వేయాలి. అలాగే నరికిన పామాయిల్ ఆకు రెండుగా చేసి  చివరిభాగం పామాయిల్ చెట్టు చుట్టూ పరచడం వలన గడ్డి పెరుగుదల అరికట్టడంతోపాటు, ఆకు కుళ్ళి అదే చెట్టుకు ఎరువుగా మారుతుంది. ఈ  పంటలో ఇదో రకమైన సౌలభ్యం ఉంది. పామాయిల్ మట్టలు నరకరాదు.చెట్టుకు కనీసం 37 ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఫలదీకరణం చెందిన గెల వేసిన తర్వాత క్రింద ఉన్న ఒకటి రెండు మట్టల తొలగింపు సౌకర్యంగా ఉంటుంది. గెల విస్తారంగా ఎదుగుతుంది. 

దేశంలో​ కొరత వల్ల, పామాయిల్​ ధర స్థిరంగా..

ఇప్పటికీ మనదేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక మూడొంతుల పామాయిల్ ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. కనుక పామాయిల్ ధర సంక్షోభం, పంట సంక్షోభం అంత తొందరగా వచ్చే అవకాశం లేదు. కనుక పంటధరలో కూడా ఎగుడుదిగుడు తక్కువగా ఉండి, నిలకడ ఉంటుంది. అయితే పామాయిల్ పంటధరలపై అంతర్జాతీయ మార్కెట్, దిగుమతి సుంకాల ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది. పామాయిల్ పంటకు దొంగల భయం కూడా ఉండే అవకాశం లేదు. రైతు ఆన్​లైన్​ కార్డు పైనే పంట సేకరణ, లావాదేవీలు జరుగుతాయి. ఇక పామాయిల్ సేద్యంలో హార్వెస్టింగ్ టీం ముఖ్యం. ఈ హార్వెస్టింగ్ టీంకు ఆయా కంపెనీలు జీవిత బీమా సౌకర్యం కలగ చేస్తున్నాయి. కాకుంటే, హర్వేస్టింగ్ సిబ్బందికి శిక్షణ, హర్వేస్టింగ్ పరికరాలు ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుండి అందజేయడం అవసరం. ఇప్పటికైతే  ధరల  సంక్షోభం, ప్రకృతి విపత్తులు, వ్యవసాయ ఒడిదుడుకులను నుండి, తక్కువ పెట్టుబడితో రైతులకు రక్షణ కల్పించ గలిగిన దీర్ఘ కాలిక పంట పామాయిల్ సేద్యం మాత్రమేనని ఘంటాపథంగా చెప్పవచ్చు. అనుభవపూర్వకంగా చెబుతున్న సత్యం. 

లాభానికి ఢోకా ఉండదు

ఆరోగ్యకరమైన పామాయిల్ గెల 20 కేజీల నుంచి 60 కేజీల వరకు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా మే నుంచి పామాయిల్ సీజన్ మొదలై అక్టోబర్ నెలవరకు నిరాటంకంగా కొనసాగుతుంది.  నెలకు  రెండుసార్లు అంటే ప్రతి పదిహేను దినాలు పామాయిల్ పంట కోతకు వస్తుంది. అంటే  ప్రభుత్వ ఉద్యోగికి  నెలకు  ఒక పర్యాయం వేతనం వేస్తే పామాయిల్ సేద్యం దారులైన రైతులకు ప్రతి  పక్షం దినాలు ఒక పర్యాయం ఆదాయం లభిస్తుంది. పంట కోత తర్వాత  వారంలోగా  నేరుగా  బ్యాంకు ఖాతాకు  సొమ్ము జమ అవుతుంది. ప్రస్తుతం టన్ను పామాయిల్ ధర  సుమారు 20వే ల రూపాయలు ఉంది. ఎకరానికి  8 నుంచి 10 టన్నుల పంట దిగుబడి ఉంటుంది. అంటే ఎకరానికి అన్ని ఖర్చులు పోను లక్ష  నుంచి  లక్షన్నర  ఆదాయం రైతుకు  నికరంగా  కనిపిస్తుంది.  ఇక  మార్కెట్  కుదుపులు కూడా  పామాయిల్​కు తక్కువే? ఎందుకంటే వాడకం ఎక్కువ ఉండి దిగుబడి అవసరాలకు సరిపడా లేని పంట ఇది. 

- ఎన్.తిర్మల్, పామాయిల్ రైతు