ఆలస్య న్యాయం అన్యాయమే

ఆలస్య న్యాయం అన్యాయమే

ప్రపంచవ్యాప్తంగా  న్యాయశాస్త్ర  పరిఙ్ఞానమున్న వ్యక్తులే కాకుండా సామాన్యులు కూడా .... ‘ఆలస్య న్యాయాన్ని  నిరాకరించిన న్యాయంగానే’ భావిస్తారు.  న్యాయం జరగాల్సిన కక్షిదారుడికి న్యాయాన్ని నిరాకరించడమంటే  ఆ వ్యక్తికి న్యాయవ్యవస్థ అన్యాయం చేసినట్టే అవుతుంది.  అందువల్లనే  ప్రపంచంలోని  అన్ని  ప్రభుత్వాలు తమ ప్రజలకు  సత్వర న్యాయం అందించేందుకు తమ న్యాయ వ్యవస్థల్లో కాలానుగుణంగా మార్పులను తెస్తున్నాయి. 

మన దేశంలో  కూడా గతంలో  కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాలు కక్షిదారులకు  సత్వర న్యాయం  అందించేందుకు రకరకాల  ప్రయత్నాలు  చేశాయి.  అంతేకాదు  న్యాయవ్యవస్థలో  మార్పుల కోసం  వందల కోట్ల రూపాయలు  ఖర్చు చేశాయి.  పస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 7,210 కోట్ల అంచనా వ్యయంతో  ఇ–కోర్ట్- ప్రాజెక్ట్  మూడో దశను  గత  నాలుగేళ్లుగా  కొనసాగిస్తున్నది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా  (2023-–24)లో  రూ.768.25 కోట్లు, ( 2024-–25)లో  రూ.1029.11 కోట్లు  ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో  రూ.907.97 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది.  అయితే సత్వర న్యాయం కోసం ఇన్ని వేల  కోట్లు వ్యయం చేస్తున్న మన ప్రభుత్వాల కృషి ఎంతవరకు సఫలీకృతమైనదని  పరిశీలించినప్పుడు మాత్రం  సామాన్యుడు ఆశ్చర్యపోక తప్పదు.

సుప్రీంకోర్టులో 90,897 కేసులు పెండింగ్​

మన కేంద్ర న్యాయశాఖా మంత్రి ఇటీవల  రాజ్యసభలో  వెల్లడించిన వివరాల ప్రకారం..  సుప్రీంకోర్టులో 90,897 కేసులు, వివిధ రాష్ట్రాల హైకోర్టల్లో  63,63,406 కేసులు, జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 4,84,57,343 కేసులు  పెండింగ్ లో  ఉన్నాయి.  ఈ  పెండింగ్ లకు  కారణం,  తెగని  లిటిగేషన్లు,  కక్షిదారుల  అనాసక్తి, నిందితుల పరారీ,   వివిధ కోర్టుల్లో  స్టేల  మంజూరు,  దస్తావేజుల కోసం నిరీక్షణ,  సాక్షుల గైర్హాజరు ముఖ్య కారణాలని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, ఆయన తెలిపిన ఈ కారణాలే కాకుండా మరొక ముఖ్య కారణం  వివిధ కోర్టుల్లో  తగినంత మంది న్యాయమూర్తులు లేక పోవడం.  కేంద్ర  ప్రభుత్వ  సమాచారం మేరకే  వివిధ హైకోర్టుల్లో 297  

న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా  ఉన్నాయి.  కేవలం అలహాబాద్  హైకోర్టులోనే  50 ఖాళీలు ఉన్నాయి.   ఇక జిల్లా కోర్టుల విషయానికొస్తే,   దేశవ్యాప్తంగా వివిధ జిల్లా కోర్టుల్లో  4,855  న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా వుండగా,  జిల్లా కోర్ట్,  సబార్డినేట్  కోర్టుల న్యాయాధికారుల ఖాళీల జాబితాలో  ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో  ఉంది.  యూపీ కోర్టుల్లో  ఖాళీల సంఖ్య 1,055.   గుజరాత్​లో  ఖాళీలు  535  ఉండగా  మధ్యప్రదేశ్​లో 384  ఉన్నాయి.  మహారాష్ట్ర  విషయానికొస్తే ఈ  ఖాళీలు  250గా  ఉన్నట్టు తెలుస్తున్నది.

కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి

కక్షిదారులకు  సత్వర న్యాయం అందించేందుకు  విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మన కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాలు ఈ ఖాళీలను  నింపే విషయంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నాయో కారణం  తెలియదు. కాకపోతే, కక్షిదారులకు సత్వర న్యాయం అందనిపక్షంలో  కక్షిదారులకే కాక  ప్రజలందరికీ  న్యాయ వ్యవస్థ మీద నమ్మకం  సడలిపోతుంది. ఈ పరిస్థితుల్లో  కక్షిదారులు తమ న్యాయంకోసం  ఇతర మార్గాలను అన్వేషిస్తారు.  వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకొని  సంఘ విద్రోహ శక్తులు,  రౌడీ ముఠాలు  రంగ ప్రవేశం చేసి ‘సెటిల్​మెంట్​ దర్బార్’లను  నిర్వహించే  అవకాశముంది. 

- బసవరాజు నరేందర్​రావు