నేడు వరంగల్​లో గవర్నర్ పర్యటన

నేడు వరంగల్​లో గవర్నర్ పర్యటన
  • వరద బాధితులకు పరామర్శ
  • నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుత   
  • సందేహాలున్నందుకే బిల్లులు వెనక్కి పంపిన 
  • నేను ఎవరికీ వ్యతిరేకం కాదు: తమిళిసై  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను పరామర్శిస్తానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తానని తెలిపారు. మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. “ప్రభుత్వం పంపిన బిల్లులను వెనక్కి పంపటానికి ఉన్న కారణాలను, సందేహాలను స్పష్టం చేశాను. వాటిని ఉద్దేశ పూర్వకంగా వెనక్కి పంపలేదు. వాళ్లు నన్ను బద్నాం చేస్తే నేను బాధ్యురాలిని కాదు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 

అయితే, అసెంబ్లీలో రెండో సారి బిల్లులను సవరించి చేసి పంపించటం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై సమాధానాలను దాటవేశారు. కాగా, వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా గవర్నర్ బుధవారం వరంగల్ భద్రకాళి ట్యాంక్ బండ్ సమీపంలోని కాలనీల్లో పర్యటించనున్నట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. హనుమకొండ, వరంగల్ రెడ్ క్రాస్ చేపట్టిన సహాయక చర్యలపై రివ్యూ కూడా చేయనున్నట్లు పేర్కొంది. త్వరలో ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ లో కూడా గవర్నర్ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.    

పబ్లిక్ కు తీవ్ర నష్టం 
రాష్ట్రంలో వర్షాలు, వరదలకు పబ్లిక్ కు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని మీడియా సమావేశంలో గవర్నర్ అన్నారు. ప్రాణ నష్టంతో పాటు ఇండ్లు, ఆస్తులు డ్యామేజ్ అయ్యాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జల్ పల్లి మున్సిపాలిటీలో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయని, నీళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరద నష్టంపై అన్ని పార్టీలు వినతిపత్రాలు ఇచ్చాయన్నారు. ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పబ్లిక్ ను ఆదుకోవాలని కోరారు.  

మహిళల ఆరోగ్యంపై రాజ్​ భవన్​లో మీటింగ్​
మహిళల ఆరోగ్యంపై “ఫౌండేషన్ ఫర్ సిటీస్” ఫౌండర్ కరుణ గోపాల్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ కు గవర్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మీటింగ్ లో పలువురు వైద్య నిపుణులు మహిళల ఆరోగ్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. డాక్టర్లు ఇచ్చిన రెకమండేషన్స్ ను కేంద్రానికి పంపనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ లో మహిళల సమస్యలు ఎక్కువ శాతం కవరేజ్ అయ్యేలా ఉందన్నారు. మహిళలకు స్కూల్, కాలేజ్ ఏజ్ నుంచే న్యూట్రిషన్ ఫుడ్, కిట్ అందించాలన్నారు.

మహిళల ఆరోగ్యం, సమస్యలపై సరైన డేటా లేదన్నారు. స్కూళ్లలో టాయిలెట్స్ లేక విద్యార్థినులు చదువు మానేస్తున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. యోగాతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేకంగా మహిళలకు ఐసీయూలు ఉండాలని, మొబైల్ మెడికల్ యూనిట్లు ఉంటే సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.