ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు

ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు

జమ్ము, కశ్మీర్‌లో ఆంక్షలు విధించిన తీరుపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అక్కడ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలులో ఉన్న 144 సెక్షన్, ఇంటర్నెట్ నిలిపివేత వంటి నిర్ణయాలపై వారంలోగా రివ్యూ చేయాలని కశ్మీర్ యూటీని, కేంద్రాన్ని ఆదేశించింది. వాక్‌ స్వాతంత్ర్యం లాగే ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు కూడా ప్రాథమిక హక్కేనని సుప్రీం అభిప్రాయపడింది.

ఆర్టికల్ – 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కేంద్రం ఆంక్షలు చట్టవిరుద్ధమని, కశ్మీర్‌లో ఉన్న అన్ని రకాల ఆంక్షలపై వారంలోపు సమీక్ష చేయాలని ఆదేశించింది.

శాంతి భద్రతల్నీ పరిగణనలోకి తీసుకుంటాం

కశ్మీర్ చాలా తీవ్రమైన హింసను చూసిందని, అయితే తాము శాంతి భద్రతల్ని పరిగణనలోకి తీసుకుని మానవ హక్కులను, ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌ను బ్యాలెన్స్ చేయాల్సి ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. జమ్ము కశ్మీర్‌లో 144 సెక్షన్, ఇంటర్నెట్ నిలిపివేత సహా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వంటి ఆంక్షలు ఏమేం ఉన్నాయో అక్కడి ప్రభుత్వం ప్రచురించాలని, దీనిపై న్యాయపరంగా చాలెంజ్ చేసే అవకాశం కల్పించాలని సూచించింది. పదే పదే 144 సెక్షన్ పెట్టడం అధికార దుర్వినియోగమవుతుందని, భావాలను వ్యక్తపరిచే హక్కును హరించేలా దీన్ని వాడకూడదని చెప్పింది. హింస జరుగుతుందన్నప్పుడే ఈ సెక్షన్ పెట్టొచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం ఇంటర్నెట్ వాడుకునే వీలు అనేది ఫ్రీడం ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందని కోర్టు చెప్పింది. ప్రాథమిక హక్కులను ఇలా పూర్తిగా నిలిపివేయడమన్నది తప్పు అని, అత్యవసర పరిస్థితి ఉందంటేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వెల్లడించింది.