ఫుల్ కెపాసిటీతో పనిచేయనున్న థర్మల్‌‌ ప్లాంట్లు

 ఫుల్ కెపాసిటీతో పనిచేయనున్న థర్మల్‌‌ ప్లాంట్లు

న్యూఢిల్లీ: బొగ్గు దిగుమతులపై ఆధారపడి పనిచేస్తున్న  థర్మల్ ప్లాంట్‌‌లు మరో మూడున్నర నెలలు అంటే ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ 15 వరకు పూర్తి కెపాసిటీతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరెంట్‌‌ కొరత ఉండకుండా చూసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమ్మర్‌‌‌‌ (ఏప్రిల్‌‌ –జూన్‌‌) లో 260 గిగావాట్ల కరెంట్ (పీక్ డిమాండ్‌‌) అవసరమవుతుందని పవర్ మినిస్ట్రీ అంచనా వేస్తోంది. 

కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో పీక్ డిమాండ్ 243 గిగావాట్లుగా రికార్డయ్యింది. ప్రస్తుత సమ్మర్‌‌‌‌ సీజన్‌‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణశాఖ  అంచనా వేస్తోంది. బొగ్గు దిగుమతులపై ఆధారపడి పనిచేస్తున్న మొత్తం 15 థర్మల్ ప్రాజెక్ట్‌‌లకు పవర్ మినిస్ట్రీ నోటీసులు పంపింది. కిందటేడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు ఈ థర్మల్‌‌ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేయాలని అక్టోబర్‌‌‌‌ 2023 లో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈ డెడ్‌‌లైన్‌‌ను పొడిగించింది. 

సడెన్‌‌గా కరెంట్‌‌ డిమాండ్‌‌ పెరిగినా  కోతలను అధిగమించేందుకు ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్‌‌ 11 ను కిందటేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వాడింది.  2023 లో మార్చి 16  నుంచి జూన్ 15 వరకు  ఈ 15 థర్మల్ ప్లాంట్లకు ఆదేశాలు ఇచ్చింది. తర్వాత సెప్టెంబర్  30 వరకు, ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు ఈ డెడ్‌‌లైన్‌‌ను పొడిగించింది. కిందటేడాది సమ్మర్‌‌‌‌లో పీక్‌‌ డిమాండ్‌‌ 229 గిగావాట్లు ఉంటుందని అంచనా వేశారు. అకాల వర్షాల కారణంగా అనుకున్నదానికంటే తక్కువ కరెంట్‌‌ వినియోగం జరిగింది. ఈ 15 థర్మల్‌‌ ప్లాంట్లలో గుజరాత్‌‌లోని (ముంద్రాలోని)  టాటాపవర్‌‌‌‌, అదానీ పవర్‌‌‌‌ ప్లాంట్లు, సలయాలోని ఎస్సార్‌‌‌‌ పవర్ ప్లాంట్‌‌, రత్నగిరి దగ్గరున్న జేఎస్‌‌బ్ల్యూ  ప్లాంట్‌‌ ఉన్నాయి.