
సంగారెడ్డి, వెలుగు: సర్కారు తీరుతో దేవుళ్లకూ తిప్పలు తప్పట్లేదు. ‘ధూపదీప నైవేద్యం’ పథకానికి ఐదు నెలలుగా ఫండ్స్ ఇవ్వకపోవడంతో అర్చకులు అప్పులు చేసి నిత్య కైంకర్యాలు చేయాల్సి వస్తోంది. అప్పులు పుట్టని అర్చకులు దాతలు, ఆయా గ్రామస్తుల సాయంతో పూజలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం 494 ఆలయాలను గుర్తించగా.. ఇందులో సంగారెడ్డిలో 122, మెదక్‌లో 86, సిద్దిపేట జిల్లాలో 286 ఉన్నాయి. ఇందులో ఆదాయం ఉన్న గుళ్ల పరిస్థితి కొంతవరకు బాగానే ఉన్నా... ఆదాయం లేక నిరాదరణకు గురైన టెంపుల్స్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఉమ్మడి ఏపీలోనే పథకం ప్రారంభం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006నే ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద నిత్యకైంకర్యాలు, అర్చకులకు ప్రతినెల రూ.2,500 అందజేసేవారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. ఇందులో రూ.2 వేలు నూనె, పూజ సామగ్రికి, మరో రూ.4 వేలు అర్చకులకు గౌరవ వేతనంగా ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 494 గుళ్లకు ఒక్కో గుడికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.29.69 లక్షలు ప్రతినెలా ఇస్తూ వచ్చింది. 5 నెలలుగా ఆ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందిగా మారింది.
పెండింగ్‌లో 600 అప్లికేషన్లు
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 494 దేవాలయాలతో పాటు మరికొన్ని ఆలయాలకు ఫండ్స్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. రెండో విడతలో భాగంగా గత ఏడాది మే నెలలో 600 ఆలయాలకు సంబంధించి అర్చకులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎండోమెంట్ శాఖ అధికారులు అప్పట్లో ఫీల్ట్ విజిట్ చేసి వివరాలు సేకరించారు. త్రిసభ్య కమిటీ విచారణ తర్వాత దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌కు నివేదిక అందజేశారు. అయినా ఇప్పటివరకు కొత్త టెంపుల్స్‌కు ధూపదీప నైవేద్యాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. నిత్య పూజలతో పాటు ఉత్సవాల సమయంలో చాలా ఇబ్బంది అవుతోందని, వెంటనే పండ్స్ ఇవ్వాలని అర్చకులు కోరుతున్నారు.
అప్లికేషన్ పెట్టి ఎనిమిది నెలలైంది
అందోల్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్‌లో ధూప దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం పైసలు ఇస్తలేదు. పథకం రెండో విడతలో భాగంగా 8 నెలల కింద అప్లికేషన్ పెట్టిన ఎండోమెంట్ అధికారులు పరిశీలనకు వచ్చి నివేదికలు తీసుకెళ్లారు. కానీ ఇప్పటివరకు పైసా ఇయ్యలే. దాతల సాయంతో దేవుడికి కైంకర్యాలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధూపదీపాలకు నిధులు మంజూరు చేయాలి. –రాము పంతులు, (అందోల్)