కేసీఆర్​ చుట్టాలకే కాంట్రాక్ట్​లు: రేవంత్​

కేసీఆర్​ చుట్టాలకే కాంట్రాక్ట్​లు: రేవంత్​

యాదాద్రి పవర్​ ప్లాంట్​పై రేవంత్​

హైదరాబాద్​, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్​ క్రిటికల్​ టెక్నాలజీని థర్మల్​ పవర్​ ప్లాంట్​ నిర్మాణంలో వాడేందుకు కేసీఆర్​ సర్కార్​ అనుమతిచ్చిందని, అదంతా కూడా ఇండియా బుల్స్​ను బతికించేందుకేనని ఎంపీ, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. 2016 ఫిబ్రవరి 1న ఆ సబ్​క్రిటికల్​ టెక్నాలజీ కొనుగోలుకు నాటి విద్యుత్​ శాఖ ముఖ్యకార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కాలుష్యం, నిర్మాణ ఖర్చులు ఎక్కువయ్యే కాలం చెల్లిన టెక్నాలజీని భద్రాద్రి థర్మల్​ ప్లాంట్​కు వాడారన్నారు. దీని వల్ల ప్రజలపై ₹7,500 కోట్ల భారం పడిందన్నారు. ప్లాంట్​ను 2017 నాటికే పూర్తి చేస్తామని చెప్పారని, రెండేళ్లు దాటినా ఒక్క యూనిట్​ కరెంట్​ కూడా తయారు చేయలేదని మండిపడ్డారు.

యాదాద్రి థర్మల్​ ప్లాంట్​కు ₹32 వేల కోట్ల పనులకు నామినేషన్​ పద్ధతిలో బీహెచ్​ఈఎల్​కు కాంట్రాక్ట్​ ఇప్పించి, ఆ కంపెనీ నుంచి కేసీఆర్​ తన బంధువులకు పనులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. దానికి కేసీఆర్​కు భారీగా కమీషన్లు ఇచ్చారని, అందుకు జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు సంతకాలు చేశారని ఆరపించారు. నామినేషన్​ పద్ధతిలో పనులు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ₹6 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. సీనియర్​ ఐఏఎస్​లను నియమించాల్సిన జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ పోస్టులో రిటైర్​ అయిన ప్రభాకర్​రావును ఎందుకు నియమించారని రేవంత్​ ప్రశ్నించారు. కరెంట్​ కొనుగోళ్లలో అవకతవకలను ఆధారాలతో సహా ఈరోజు బయటపెడతామన్నారు.

కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని, దర్యాప్తు చేయించేందుకు సిద్ధమా అని సవాల్​ విసిరారు. గల్లీల్లో ఫైటింగ్​, ఢిల్లీలో దోస్తానా చేస్తూ బీజేపీ, టీఆర్​ఎస్​లు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయన్నారు. కరెంట్​ కొనుగోళ్లలో ₹1000 కోట్ల అవినీతి జరిగినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్​ ఆరోపించారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్​ చేశారు. తమ ఆరోపణలు తప్పైతే ఏ శిక్షకైనా రెడీ అన్నారు.  కేసీఆర్​ చేసిన సహారా ఇండియా కుంభకోణం, ఈఎస్​ఐ కుంభకోణాలపై మర్రి శశిధర్​రెడ్డి, సాగునీటి అవినీతిపై ఉత్తమ్​ కుమార్​రెడ్డి, భట్టి విక్రమార్క, కరెంట్​, భూకుంభకోణాలను బయటపెట్టేందుకు తనతో పార్టీ కమిటీ వేసిందని ఆయన తెలిపారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి