
- ప్రసంగం నిరాశకు గురిచేసిందన్న ఉద్యోగులు
- సీపీఎస్, రిటైర్మెంట్ వయసు పెంపుపైనా ప్రకటన చేయలేదు
- తమ గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన
- భవిష్యత్ కార్యాచరణ, ఆందోళనలపై త్వరలో నిర్ణయం?
హైదరాబాద్, వెలుగు: పంద్రాగస్టు సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తమను నిరాశకు గురి చేసిందని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సవరణ (పీఆర్సీ)పై ప్రకటన ఉంటుందని భావించినా వాటి ప్రస్తావనే లేకుండా ప్రసంగం సాగిందని చెప్పారు. మధ్యంతర భృతి (ఐఆర్), కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పెంపు, తదితర అంశాలపైనా ప్రకటన చేయలేదని వాపోయారు. వరాలు కురిపిస్తారనుకున్న సీఎం.. డిమాండ్ల ఊసెత్తకుండా తమ ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగ సంఘాలు త్వరలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ఆందోళనకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
ఎంతో ఆశగా ఎదురుచూస్తే..
పీఆర్సీ, ఐఆర్, సీపీఎస్ తదితర అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మౌనం వహిస్తోంది. పీఆర్సీ ఆలస్యమైతే కనీసం ఐఆర్ అయినా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో వరుస ఎన్నికలు, కోడ్ ఉండటం వల్ల సైలెంట్ గా ఉన్న ఉద్యోగులు.. తమ సమస్యలు పరిష్కరించకపోతే జులై నుంచి నుంచి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా సీఎం ప్రకటిస్తారన్న ఆశతో ఎదురు చూశారు. కానీ సీఎం వాటి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశకు గురయ్యామని వారు చెబుతున్నారు.
ప్యాకేజీ ఏదీ?
పీఆర్సీ, ఐఆర్, రిటైర్మెంట్ వయసు పెంపుపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి వివరిస్తామని ఇటీవల సీఎం చెప్పారు. అన్నీ కలిపి ప్యాకేజ్ రూపంలో ఇస్తామని ప్రకటించారు. ఇలా చెప్పి రెండు నెలలవుతోందని, ఇంత వరకు సమావేశం ఏర్పాటు చేయలేదని ఉద్యోగులు, పెన్షనర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేతన సవరణ కోసం గతేడాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదని అంటున్నారు. సీపీఎస్ రద్దు నిర్ణయం కేంద్రంలో చేతుల్లో ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చెబుతోందని మండిపడుతున్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా దానిపై ప్రకటన చేయలేదు. గత డిసెంబర్ నుంచి ప్రతినెల సుమారు 500 మంది రిటైర్ అవుతున్నారు” అని చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి
టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం.. తదితర అసోసియేషన్ల నేతలు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు, జిల్లాల నేతలతో మాట్లాడుతున్నప్పుడు తమ డిమాండ్లపై వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలని నిలదీస్తున్నారు. టీజీవో నేతగా ఉండి మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ పై కూడా తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ, సీపీఎస్, ఇతర సమస్యలను సీఎం వద్ద ప్రస్తావించటం లేదంటూ ఇటీవల ఓ జిల్లాకు వెళ్లినపుడు ఉద్యోగులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కనీసం సీఎంతో సమావేశం ఏర్పాటు చేసేందుకు ఎందుకు ప్రయత్నించటం లేదని నిలదీసినట్లు అన్నట్లు సమాచారం.