- ఆరు నెలల్లో ఏర్పాటు చేస్తం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- రాజస్తాన్‌లోని బికనీర్ ‘శాంచూ’ సరిహద్దు చౌకీ వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్లతో భేటీ
జైపూర్: దేశ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా జరుగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాబోయే 6 నెలల్లో సరిహద్దుల్లో అత్యాధునిక ‘యాంటీ-డ్రోన్’ (డ్రోన్ నిరోధక) వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
మంగళవారం రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లా శాంచూ సరిహద్దు చౌకీ (ఔట్ పోస్ట్) వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్లను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. కేవలం సాంకేతికతతోనే సరిహద్దులను పూర్తిగా సురక్షితం చేయలేమని, డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు వాటిని స్వీకరించే దేశద్రోహ శక్తులను తుడిచిపెట్టడానికి స్థానిక పోలీసులు, పౌర పరిపాలనతో బలమైన సమన్వయం అవసరమని అన్నారు.
నాలుగు అంచెల రక్షణ వలయం
సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, సరిహద్దు ప్రాంత ప్రజలతో కూడిన 4 అంచెల భద్రతా గ్రిడ్ ఎంతో కీలకమని అమిత్ షా తెలిపారు. ఈ శక్తుల మధ్య సమన్వయం కుదిరినప్పుడే పూర్తి సురక్షితమైన సరిహద్దుల కల సాకారమవుతుందని చెప్పారు.
ఈ భద్రతా గ్రిడ్‌ను బలోపేతం చేసేందుకు ఇప్పటికే బిహార్, గుజరాత్, త్రిపుర, బెంగాల్‌లాంటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి బీఎస్‌ఎఫ్ కార్యాచరణ పరిధిని 15 కి.మి. నుంచి 50 కిలో మీటర్లకు పెంచినట్టు వివరించారు.
జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివి
దేశం కోసం ప్రాణాలర్పించిన 2 వేల మందికి పైగా బీఎస్‌ఎఫ్ అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, మంచు పర్వతాలు, దట్టమైన అడవులు, ఎడారి ఇసుక తిన్నెల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని చెప్పారు. 1965 భారత్–పాక్ యుద్ధంలో శాంచూ చౌకీని పాకిస్తాన్ దాడుల నుంచి బీఎస్‌ఎఫ్ జవాన్లు వీరోచితంగా కాపాడుకున్న నేపథ్యాన్ని గుర్తుచేశారు.
‘ఆపరేషన్ సిందూర్’ లో బీఎస్‌ఎఫ్ పోషించిన పాత్రను ప్రశంసించారు. శాంచూ ఔట్ పోస్ట్‌లో మహిళా జవాన్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన బ్యారక్‌లను అమిత్ షా ప్రారంభించారు. మహిళా దళాలు అంచనాలకు మించి రాణిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
