మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు

మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 23 కాలేజీలు ఉండగా 7 కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా(బీ కేటగిరీ), ఎన్‌ఆర్‌‌ఐ కోటా( సీ కేటగిరీ) సీట్లకు ఫీజులు పెంచారు. పెంపు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని మెడికల్ కాలేజీల్లో(నాన్ మైనారిటీ) కన్వీనర్ కోటా ఫీజు రూ.60 వేలు, బీ కేటగిరీ సీటు ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు, సీ కేటగిరీ ఫీజు రూ.23 లక్షలు ఉంది. ఈసారి కాలేజీలోని సౌలతులను బట్టి బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజులను వేర్వేరుగా నిర్ణయించారు. చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజ్, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీలో బీ కేటగిరీ సీటు ఫీజును రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెంచారు. సీ కేటగిరీ ఫీజును రూ.23 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెంచారు. మిగిలిన అన్ని కాలేజీల్లో బీ కేటగిరీకి ప్రస్తుతం ఉన్న రూ.11.55 లక్షలు, సీ కేటగిరీకి రూ.23 లక్షలు కొనసాగించారు. కన్వీనర్ కోటా ఫీజులో మాత్రం మార్పులు చేయలేదు. అన్ని కాలేజీల్లోనూ కన్వీనర్ కోటా ఫీజు రూ.60 వేలుగానే ఉంచారు. డెంటల్ కోర్సు (బీడీఎస్) బీ కేటగిరీ సీటు ఏడాది ఫీజు ప్రస్తుతం రూ.4 లక్షలు ఉండగా,  మెజారిటీ కాలేజీల్లో రూ.4.2 లక్షలు చేశారు.ఎంఎన్‌ఆర్ డెంటల్ కాలేజీ, పనానియా మహావిద్యాలయ కాలేజీల్లో మాత్రం రూ.5 లక్షలకు పెంచారు. 
బీ కేటగిరీ ఫీజు 1.25 రెట్లకు మించకుండా సీ కేటగిరీ సీటు ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 

లక్షల్లో భారం
మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు గతేడాదే తెలంగాణ అడ్మిషన్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదనలు పంపింది. కరోనాతో ఫీజుల పెంపుపై సర్కార్ వెనక్కి తగ్గింది. కాలేజీల నుంచి ఒత్తిడి రావడంతో ఈసారి పెంపునకే మొగ్గు చూపింది. కాలేజీని బట్టి ఒక్కో ఏడాదికి రూ.1.45 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఫీజు పెంచారు. ఒక్కో స్టూడెంట్‌పై పూర్తి కోర్సు(నాలుగున్నర ఏండ్లు) ఫీజు కింద రూ.6.5 లక్షల నుంచి రూ.13.5 లక్షల అదనపు భారం పడనుంది.

For more news..

డేరా బాబాకు పెరోల్

 

రాజన్న సన్నిధికి లక్ష మంది భక్తులు