రుచి, వాసన తెల్వదు.. క‌రోనా కొత్త ల‌క్ష‌ణాలు.!

రుచి, వాసన తెల్వదు.. క‌రోనా కొత్త ల‌క్ష‌ణాలు.!
  • కరోనా లక్షణాల్లో చేర్చడంపై కేంద్ర సర్కార్​ యోచన
  • ఆ సింప్టమ్స్​ కనిపించినా టెస్టులు చేయడంపై చర్చ

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా కరోనా లక్షణాలంటే దగ్గు, జ్వరం, జలుబు..! ఇంకా చెప్పుకోవాలంటే కడుపునొప్పి, విరేచనాలు..! వాటికి తోడుగా రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం వంటివి చేరాయి. చాలా స్టడీల్లో కరోనా పేషెంట్లకు ఆ లక్షణాలూ ఉన్నాయని తేలింది. అయితే, అధికారికంగా మాత్రం మన దగ్గర వాటిని లక్షణాల్లో చేర్చలేదు కేంద్ర సర్కారు. ఇప్పుడు వాటినీ కరోనా లక్షణాల్లో చేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. దేశంలో టెస్టులు చేసేందుకు ఆ లక్షణాలనూ లెక్కలోకి తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గత ఆదివారం జరిగిన కొవిడ్​ నేషనల్​ టాస్క్​ ఫోర్స్​ సమావేశంలో చర్చ కూడా జరిగిందని అంటున్నాయి. ‘‘ఆ మీటింగ్​లో కరోనా లక్షణాల్లో ఆ రెండింటినీ చేర్చడంపై చర్చ జరిగింది. చాలా మంది పేషెంట్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నందున.. ఆ లక్షణాలున్నవారికీ టెస్టులు చేయాలని కొందరు సభ్యులు సూచించారు. అయితే, దీనిపై ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదు’’ అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే వీటిని అమెరికా నేషనల్​ పబ్లిక్​ హెల్త్​ ఇనిస్టిట్యూట్​ అయిన సెంటర్స్​ ఆఫ్​ డిసీజ్​ కంట్రోల్​ కరోనా లక్షణాల్లో చేర్చింది.

టెస్టులపై ఇవీ ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​

  • విదేశాల నుంచి వచ్చినోళ్లు, వలసకూలీలకు ఇన్​ఫ్లుయెంజా (జలుబు, దగ్గు, జ్వరం వంటివి) లక్షణాలుంటే వారంలోపు టెస్టులు చేయాలి.
  • ఇన్​ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలి.
  • కరోనా డ్యూటీలో ఉన్న హెల్త్​వర్కర్లు, కంటెయిన్​మెంట్​ జోన్లలో పనిచేస్తున్న హెల్త్​ వర్కర్లకు లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయాలి.
  • పాజిటివ్​ వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్​ అయి, లక్షణాలు కనిపించని హైరిస్క్​ వ్యక్తులకు.. కరోనా రోగిని కలిసిన 5 నుంచి 10 రోజుల్లో టెస్టులు చేయాలి.
  • హాట్​స్పాట్​లు, కంటెయిన్​మెంట్​జోన్లలో ఉంటున్న ఇన్​ఫ్లుయెంజా పేషెంట్లు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న వాళ్లకూ టెస్టులు చేయాలి.

మొత్తం నాడీ వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్​

శరీరంలోని మొత్తం నాడీ వ్యవస్థకు (నర్వస్​ సిస్టమ్​) కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని తేలింది. అమెరికాలోని నార్త్​వెస్టర్న్​ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న సగం మంది కరోనా రోగులకు తలనొప్పి, ఫిట్స్​, స్ట్రోక్​, బలహీనత, కండరాల నొప్పులు, నీరసం, కళ్లు తిరగడం, యాక్టివ్​గా ఉండకపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి లక్షణాలున్నాయని గుర్తించారు. వాటితో పాటు రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం వంటి లక్షణాలూ ఉన్నట్టు తేల్చారు. చాలా మంది పేషెంట్లలో జ్వరం వంటి లక్షణాలు లేకముందే ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయని స్టడీకి నేతృత్వం వహించిన ప్రొఫెసర్​ ఇగోర్​ కోరాల్నిక్​ చెప్పారు. మెదడు, వెన్ను, నరాలు, కండరాలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని అన్నారు. మొత్తం నాడీ వ్యవస్థకూ అది ముప్పుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.