
- కొత్తగా జాతీయ క్రీడా బోర్డు ఏర్పాటు
- బోర్డుకు విస్తృతమైన అధికారాలు
- అథ్లెట్ల సంక్షేమం, నిధుల దుర్వినియోగం అరికట్టడం ముఖ్య ఉద్దేశం
న్యూఢిల్లీ: ఇప్పటివరకు స్వయంప్రతిపత్తి హోదాతో పని చేస్తున్న బీసీసీఐ.. ఇక నుంచి నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ పరిధిలోకి రానుంది. బుధవారం ఈ బిల్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడనప్పటికీ ప్రతిపాదిత జాతీయ క్రీడా బోర్డు నుంచి బీసీసీఐ గుర్తింపు పొందాల్సి ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. ‘ఈ బిల్ చట్టంగా మారిన తర్వాత అన్ని జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్‌ఎస్‌ఎఫ్) మాదిరిగానే బీసీసీఐ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది.
స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి నిధులు తీసుకోకపోయినా పార్లమెంట్ చట్టానికి లోబడి పని చేయాలి. ఇతర ఎన్‌ఎస్‌ఎఫ్‌ల మాదిరిగానే స్వయంప్రతిపత్తి ఉంటుంది. కానీ వివాదాలు ఉంటే జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌కు వెళ్లి పరిష్కరించుకోవాలి. ఎన్నికల నుంచి ప్లేయర్ల ఎంపిక వరకు ఈ బిల్ ప్రకారమే జరుగుతాయి. ఎన్‌ఎస్‌ఎఫ్‌లను ప్రభుత్వం నియంత్రించడం ఈ బిల్ ఉద్దేశం కాదు. బలవంతం లేకుండా మంచి పరిపాలన అందించడానికి ప్రభుత్వం ఓ సహాయకారిగా ఉంటుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడుతుండటంతో బీసీసీఐ తప్పనిసరి పరిస్థితుల్లో నేషనల్ స్పోర్ట్స్ బిల్ కిందకు రావాల్సి వచ్చింది.
చైర్ పర్సన్ ఆధ్వర్యంలో..
ప్రతిపాదిత ఎన్‌ఎస్‌బీకి సంబంధించిన అన్ని నియామకాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. చైర్ పర్సన్, ఇతర మెంబర్స్‌ను ఎంపిక చేసేందుకు ముందుగా సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ క్రీడా వాటాదారులు, ప్రజలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాత బిల్ ప్రకారం కొన్ని సిఫార్సులు చేస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వం నియామకాలు చేపడుతుంది. సెలెక్షన్ కమిటీలో క్యాబినెట్ కార్యదర్శి లేదా స్పోర్ట్స్ సెక్రటరీ చైర్ పర్సన్‌గా ఉంటాడు. ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు గుర్తింపు ఇవ్వడం లేదా నిలిపి వేసిన సందర్భంలో అవసరమైన తాత్కాలిక ప్యానెల్‌లను ఏర్పాటు చేయడానికి ఈ బోర్డుకు అధికారం ఉంటుంది.
ఇప్పటి వరకు ఈ విధులన్నింటినీ ఐవోఏ నిర్వహిస్తూ వస్తోంది. అన్ని ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు సంబంధించి ఇది నోడల్ బాడీగా వ్యవహరించింది. స్పోర్ట్స్ బిల్.. ఒలింపిక్ చార్టర్‌తో స్పష్టంగా సరిపోయిందని చెప్పిన సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ.. ఐవోసీని సంప్రదించిన తర్వాతే ఈ ముసాయిదా పత్రాన్ని రూపొందించామన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించడానికి ఇండియా బిడ్ చేయాలంటే ఐవోసీతో సామరస్య పూర్వక సంబంధాలు చాలా కీలకమని చెప్పారు. ఈ బిల్ ప్రకారం స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేసే చాన్స్ ఉంటుంది.
పాలనలో పారదర్శకత..
సంస్థాగతంగా క్రీడా సమాఖ్యలను మరింత బలోపేతం చేసేందుకు ఈ బిల్‌ను తీసుకొస్తున్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం, పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, అథ్లెట్ల సంక్షేమం, ఫిర్యాదులు తగ్గించడం ఈ బిల్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా బోర్డు (ఎన్‌ఎస్‌బీ)ని ఏర్పాటు చేస్తారు. ఎన్నికల అక్రమాలు, ఆర్థిక దుర్వినియోగం, ఇతర ఫిర్యాదులతో సస్పెండ్ అయిన సమాఖ్యలకు మళ్లీ గుర్తింపు ఇవ్వడం లేదా తిరస్కరించడం వంటి విస్తృత అధికారాలు ఈ బోర్డుకు ఉంటాయి. ఆయా క్రీడల ఇంటర్నేషనల్ బోర్డులు అభ్యంతరం చెప్పకపోతే 70 నుంచి 75 ఏళ్ల మధ్య వారు కూడాఎన్నికల్లో పోటీ చేయొచ్చు. దానివల్ల ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ సమాఖ్యల చట్టాలను అంగీకరించే అవకాశం ఉంటుంది.