
కోనరావుపేట, వెలుగు : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలను శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి 1,200 మందికిపైగా స్టూడెంట్లు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
ఏకలవ్య మోడల్ స్కూళ్లకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణానికి అదనంగా రూ.10 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... పేదలకు మంచి విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గురుకులాలను ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందన్నారు.
అనంతరం మంత్రి, విప్, కలెక్టర్‌ను స్కూల్ మేనేజ్‌మెంట్ సన్మానించారు. కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ సెక్రటరీ సీతా మహాలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్, ప్రిన్సిపాల్ ఆర్ఎస్. యాదవ్, ఈఎంఆర్ఎస్ అడిషనల్ సెక్రటరీ వెంకన్న, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యానాయక్, మాలావత్ పూర్ణ పాల్గొన్నారు.