ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. సబ్సిడీ సిలిండర్ల కోటా 4కు తగ్గింపు..!

ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. సబ్సిడీ సిలిండర్ల కోటా 4కు తగ్గింపు..!

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో ఇబ్బందుల వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) రాయితీ స్కీమ్‎కు మోడీ సర్కార్ కోత విధించింది. 

పీఎంయూవై లబ్ధిదారులకు ఏటా అందించే సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి నాలుగుకు తగ్గించింది. అంటే.. పీఎంయూవై లబ్ధిదారులకు ఇక మీదట సబ్సిడీపై ఏడాదికి నాలుగు సిలిండర్లు మాత్రమే లభిస్తాయి. ఐదో సిలిండర్ కావాలంటే రాయితీ వర్తించదు. బయట మార్కెట్ రేటుకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

దేశంలోని పేద ప్రజలకు రాయితీపై వంట గ్యాస్ అందించడమే లక్ష్యంగా 2016, మే నెలలో మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‎పై రూ.300 చొప్పున రాయితీ అందిస్తుంది. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో లబ్ధిదారులకు సబ్సిడీపై ఏటా 12 గ్యాస్ సిలిండర్లు అందించేవారు. 

వివిధ కారణాలతో గతేడాది రాయితీ సిలిండర్ల కోటాను 12 నుంచి 9కి తగ్గించింది కేంద్రం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్వల యోజన స్కీమ్ లబ్ధిదారులకు షాకిస్తూ రాయితీపై అందించే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి ఏకంగా 4కి కుదించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆకానంటుతున్న నిత్యవసరాల ధరలతో అల్లాడిపోతున్న పేద ప్రజలకు రాయితీపై అందించే సిలిండర్ల కోటాను తగ్గించి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది.

పేదోడికి భారంగా మారిన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది. పీఎంయూవై లబ్ధిదారులు ఏడాదికి సగటున నాలుగైదు సిలిండర్లు మాత్రమే వాడుతుంటారని.. తాజా తగ్గింపు వారిపై పెద్దగా ప్రభావం చూపుదంటున్నారు పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 

రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో పేద ప్రజలు భయపడి వంట గదిలో గ్యాస్ సిలిండర్ వాడకం బంద్ పెట్టి మళ్లీ కట్టెల పొయ్యి బాట పడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉజ్వల యోజన లబ్ధిదారులు ఏటా నాలుగైదు సిలిండర్లు మాత్రమే వాడుతున్నారని.. లబ్ధిదారుల వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకునే పీఎంయూవై కోటాను తగ్గించామని చెప్పుకుంటుంది. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఈ సాకు పేదోడికి గుదిబండగా మారనుంది.