
- ఈ ఏడాదిలోనే స్పెక్ట్రం వేలం
- హువావేపై త్వరలోనే నిర్ణయం
- బీఎస్‌ఎన్‌ఎల్ కు సాయం చేస్తాం
- కేంద్ర టెలికం మంత్రి ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రస్తుతం సంవత్సరంలో 5జీతోపాటు ఇతర టెక్నాలజీలకు అవసరమైన స్పెక్ట్రం అమ్మకానికి వేలం నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమ దగ్గర తగినంత స్పెక్ట్రం ఉందని, రాబోయే వంద రోజుల్లోపు 5జీ సేవల ప్రారంభానికి ట్రయల్స్ కూడా నిర్వహిస్తామని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఈశాఖ మంత్రిగా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ప్రభుత్వ టెల్కోలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కోలుకునేలా చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అయితే ఈ రెండు సంస్థలు మరింత వృత్తినైపుణ్యంతో వ్యవహరిస్తూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించారు. చైనా టెలికం కంపెనీని హువావేను 5జీ ట్రయల్స్‌కు అనుమతిస్తారా ? అనే ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయంలో చిక్కుముడులు ఉన్నాయని, భద్రతాకోణంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. భద్రతపరమైన సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సహా పలు దేశాలు హువావేను పక్కనపెట్టిన నేపథ్యంలో ప్రసాద్ ఈ మాటలు అన్నారు. 5జీ స్పెక్ట్రంతోపాటు 8,644 మెగాహెజ్‌ల టెలికం ఫ్రీక్వెన్సీని వేలం వేయాలని ట్రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బేస్ ధర అంచనాను రూ.4.9 లక్షల కోట్లుగా పేర్కొంది. ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న తాము ఇంత బేస్‌ధరతో స్పెక్ట్రంను కొనడం సాధ్యం కాదని టెల్కోలు అంటున్నాయి.
‘‘స్పెక్ట్రంపై ట్రాయ్ తన సిఫార్సులను తెలియజేసింది. స్టాండింగ్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ వాటిని పరిశీలిస్తున్నాయి. ట్రాయ్‌తో సంప్రదింపులు జరపాలని చెబితే ఆ విషయాన్ని పరిశీలిస్తాం. ఇవన్నీ పూర్తయ్యాక కేబినెట్‌లో చర్చించి వేలానికి ఏర్పాట్లు చేస్తాం’’ అని వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం వేలంతోపాటు బ్రాడ్‌బ్యాండ్ రెడీనెస్ ఇండెక్స్ తయారీ, ఐదు లక్షల వైఫై హాట్‌స్పాట్లు త్వరగా ఏర్పాటయ్యేలా చూడటం, టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించడం వంటివి తన ప్రాధాన్యాలు అని వెల్లడించారు. హైస్పీడ్ ఇంటర్నెట్ వాడకం, అందుబాటులో ఉన్న వసతులు, అనుమతుల మంజూరు విధానం.. తదితర అంశాల ఆధారంగా ఇండెక్స్‌ను రూపొందిస్తామని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగంలో 5జీ కీలకపాత్ర పోషిస్తుందని, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సేవలను మరింత సమర్థంగా అందించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
సోషల్ మీడియా దుర్వినియోగం వద్దు
సోషల్ మీడియాను చెడు పనులకు వాడుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వాటి యాజమాన్యాలదేనని ప్రసాద్ స్పష్టం చేశారు. ఇవి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, ఉగ్రవాదం, మతవాదాలను రెచ్చగొట్టడానికి సోషల్ మీడియా వేదిక కాకూడదని స్పష్టం చేశారు. భావాలను వ్యక్తీకరించే హక్కును గౌరవిస్తామని, అయితే సోషల్ మీడియాపై హేతుబద్ధమైన ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై విధించాల్సిన ఆంక్షల గురించి టెలికం శాఖ గత ఏడాది అభిప్రాయలను కూడా కోరింది. డేటా ప్రొటెక్షన్ చట్టానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపిన మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈసారి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారా లేదా అనే విషయం మాత్రం చెప్పలేదు.