
జీపీఎస్ వల్ల చాలా ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని సార్లు తప్పుడు మార్గాలను చూపించడం వల్ల చేదు అనుభవాలు ఎదురైన సంఘటనలూ లేకపోలేదు. అదే తరహాలో గూగుల్ మ్యాప్ ను అనుసరించిన ఇద్దరు డాక్టర్లు.. చివరికి ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఓ నదిలో కారు మునిగిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించారు. డాక్టర్ అద్వైత్, డాక్టర్ అజ్మల్ కొచ్చిలో డాక్టర్ అద్వైత్ పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగి వస్తుండగా వారి కారు నీటిలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు. జీపీఎస్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే విషయంపై స్పష్టత లేదు.
చీకటి, భారీ వర్షం, తెలియని రహదారి. ఎక్కడ్నుంచి, ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో డాక్టర్ అద్వైత్ ఆ అర్ధరాత్రిలో జీపీఎస్ ను ఫాలో అవ్వక తప్పలేదు. అలా వారు ప్రయాణాన్ని కొనసాగించారు. డాక్టర్ అద్వైత్ తన తోటి వైద్యుడితో పాటు మరో నలుగురు అదే కారులో వెళ్లడం ప్రారంభించారు. కానీ ఆ జీపీఎసే తమకు చావు మార్గాన్ని చూపుతోందని వారికి తెలియదు. జీపీఎస్ సూచనల మేరకు కారును నేరుగా పోనిస్తూ వచ్చారు. కానీ ఒకానొక ప్రాంతంలో అది రోడ్డు కాదని, నది అని జీపీఎస్ వారికి చెప్పలేదు. చివరికి వారి కారు నీటితో నిండిన నదిలో మునిగిపోవడం ప్రారంభించింది. అందరూ అరవడం మొదలుపెట్టారు. మరో ముగ్గురు వ్యక్తులు కారు నుంచి ఎలాగోలా బయటకు వచ్చారు. అయితే కొద్దిసేపటికే డాక్టర్ అద్వైత్, అతని తోటి డాక్టర్ నీటిలో మునిగిపోయారు. ఈ సంఘటనలో బాధాకరమైన విషయం ఏమిటంటే, అదే రోజు డాక్టర్ అద్వైత్ పుట్టినరోజు.
కారు మునిగిపోవడంతో డాక్టర్ అద్వైత్ (29), అతని సహోద్యోగి డాక్టర్ అజ్మల్ ఆసిఫ్ (29) సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించినప్పటికీ కారు లాక్ చేసి ఉండడంతో వారు బయటకు రాలేకపోయారు. అతనితో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు బయటకు రావడంతో వారి ప్రాణాలతో ఉన్నారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లా గోతురుత్ ప్రాంతంలో అక్టోబర్ 1న అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగింది.
తాము జీపీఎస్ ను అనుసరించి ప్రయాణం చేశామని, తాము డ్రైవింగ్ చేయనందున.. అప్లికేషన్ లో సాంకేతిక లోపం జరిగిందా, లేదంటే మానవ తప్పిదమా అని చెప్పలేమని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని కొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ అద్వైత్ మృతదేహాన్ని కలమసేరి మెడికల్ కాలేజీకి, డాక్టర్ అజ్మల్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.