2 సీట్లు.. మస్తు పోటీ: ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఇండిపెండెంట్లు

2 సీట్లు.. మస్తు పోటీ: ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఇండిపెండెంట్లు

‘వరంగల్’లో 71, ‘హైదరాబాద్’లో 93 మంది
జోరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఎన్నికల ప్రచారం
ఓటరు నమోదు నుంచే వ్యూహాలు, ప్రచారాలు
నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్రయత్నాలు
మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిన టీఆర్ఎస్
పార్టీ శ్రేణుల సపోర్టుతో బీజేపీ, కాంగ్రెస్ ముందుకు
ఈ నెల 14న పోలింగ్

హైదరాబాద్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దీటుగా ఇండిపెండెంట్లు బరిలో దిగడం మరింత ఆసక్తి రేపుతోంది. ఎవరికి వారుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తూ, ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన నేతలు, ప్రజా సంఘాల లీడర్లు పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వరంగల్,- నల్గొండ, -ఖమ్మం ఎమ్మెల్సీ  సీటుకు మొత్తం 71 మంది పోటీ పడుతుండగా.. హైదరాబాద్-, రంగారెడ్డి, -మహబూబ్ నగర్ స్థానానికి 93 మంది పోటీ చేస్తున్నారు.

ఈ నెల 14న పోలింగ్ జరుగనుంది. పోలింగ్​కు  2 వారాల టైమే మిగిలి ఉండటంతో ఓటర్లను నేరుగా కలిసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

ఓటరు నమోదు నుంచే ప్రచారం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతిసారి కొత్తగా ఓటరు నమోదు ఉంటుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల లీడర్లు, ఇండిపెండెట్లు గ్రాడ్యుయేట్ల ఇంటికి వెళ్లి వారి సర్టిఫికెట్లు, ఫోన్ నంబర్లను సేకరించి, ఓటరుగా నమోదు చేయించాయి. ఓటు నమోదు పూర్తయిన నాటి నుంచి పండుగలు, జాతీయ పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఓటర్ల సెల్ ఫోన్లకు టెస్ట్, వాయిస్ మెసేజ్ లు పంపుతున్నారు. మార్నింగ్  వాకింగ్ లకు, స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులు, వర్సిటీలకు వెళ్తూ ఓటర్ల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. పార్టీల అభ్యర్థులు తమ పార్టీ నెట్ వర్క్ ద్వారా ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండలం, గ్రామాల వారీగా ఇన్ చార్జులను నియమించింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఉద్యమకారులు, ప్రజాసంఘాల నేతలు తమ అభిమానులు, పరిచయస్తుల ద్వారా ఓటర్లను  ఆహ్వానించి వారి మద్దతు అడుగుతున్నారు.

చాలెంజ్ గా తీసుకున్న రాజకీయ పార్టీలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చాలెంజ్ గా తీసుకున్నాయి.  స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. ఎన్నికలు జరిగే జిల్లాలకు ఒక్కో మంత్రిని ఇన్‌‌చార్జిగా నియమించారు. ఎన్నికలు లేని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రచారం చేయాలని చెప్పారు. వరంగల్ సిట్టింగ్ స్థానంతో పాటు, హైదరాబాద్ సీటును గెలిస్తే జాతీయ పార్టీలకు చెక్ పెట్టొచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లైన్ క్లియర్‌‌గా ఉంటుందని భావిస్తోంది. హైదరాబాద్ సిట్టింగ్ సీటు తో పాటు వరంగల్ సీటునూ కైవసం చేసుకుంటే రాష్ట్రంలో తిరుగు ఉండదని అంచనా వేస్తోంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను ఎన్నికలు జరిగే జిల్లాల్లో పనిచేయిస్తోంది. 2019లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కూడా గ్రాడ్యుయేట్లు తమకు పట్టం కడుతారని ధీమాతో ఉంది.

ఓయూ, కేయూ క్యాంపస్ ఓట్లు కీలకం

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉస్మానియా, కాకతీయ  వర్సిటీ క్యాంపస్లోని స్టూడెంట్స్ కీలకం కానున్నాయి. వీరిలో మెజార్టీ స్టూడెంట్స్ ఎవరికి మద్దతు పలికితే వారు గెలుస్తారని నమ్ముతున్నారు. ఓయూలో  2 వేల మంది, కేయూలో  1,500 మంది స్టూటెంట్స్ ఉన్నారు. వీరంతా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందన్న కోపంతో ఉన్నారు.

సవాల్ విసురుతున్న ఇండిపెండెంట్లు

ఎప్పుడూ లేని విధంగా ఈసారే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాసంఘాల నేతలు పోటీకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా వీరు దూసుకుపోతున్నారు. వరంగల్ స్థానంలో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, లెఫ్ట్ పార్టీల నుంచి జయసారథి రెడ్డి పోటీకి దిగారు. అయితే వీరికి ఉద్యమకారులు, ప్రజాసంఘాల లీడర్లు గట్టి పోటీ ఇచ్చే చాన్స్ ఉంది. ఇండిపెండెంట్‌‌‌‌గా తీన్మార్ మల్లన్న, తెలంగాణ జన సమితి నుంచి ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, మరో ఇండిపెండెంట్‌‌‌‌గా హరిశంకర్‌‌‌‌గౌడ్‌‌‌‌  సొంత నెట్ వర్క్‌‌‌‌తో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ స్థానంలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, టీఆర్ఎస్ నుంచి సురభీ వాణీదేవి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి ఎల్. రమణ పోటీ పడుతుండగా.. ఇండిపెండెంట్లటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్,ప్రముఖ మెజీషియన్‌‌‌‌ సామల వేణు, రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌  దొంతు లక్ష్మినారాయణ  బరిలోకి దిగారు.