
- ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని రిక్వెస్ట్
- ఒలింపిక్స్‌లో రెండు గేమ్స్ తెలంగాణలో పెట్టాలని వినతి
- క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వాలని, క్రీడాకారులకు రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ కల్పించాలన్న సీఎం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది దేశంలో జరగబోయే ఖేలో ఇండియా గేమ్స్–2026ను రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్య దర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. దాదాపు అరగంటకు పైగా భేటీ సాగింది.
‘‘ఖేలో ఇండియా, 40వ నేషనల్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణకు అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. అలాగే 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్‌లో కనీసం రెండు ఈవెంట్లు రాష్ట్రంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధి, క్రీడా నైపుణ్యం కలిగిన వారి ఎంపిక, ఇతర ప్రోగ్రాంలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీని పునరుద్ధరించాలని రిక్వెస్ట్ చేశారు.
క్రీడాభివృద్ధికి సహకరించండి
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని కేంద్ర మం త్రి మాండవీయను సీఎం రేవంత్ కోరారు. ‘‘భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, పాలమూరు వర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన వర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేట్‌లో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ అభివృద్ది, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ ఆధునీకరణ, నల్గొండ మహాత్మా గాంధీ వర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు ఇవ్వండి” అని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్నివిధాలా కృషి చేస్తున్నదని తెలిపారు. అయితే, తమ విజ్ఞప్తులపై పరిశీలించి సానుకూలం నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.