
సంగారెడ్డి, వెలుగు: ఎమ్మెల్సీగా గెలిపిస్తే న్యాయవాదులకు అన్ని విధాల అండగా ఉంటానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో 600 మందికి పైగా న్యాయవాదులు ఉన్నారని, వారి పక్షాన నిలబడతానన్నారు. న్యాయవాదులకు శాశ్వత నివాసం కోసం మండలిలో పోరాడతానని హామీ ఇచ్చారు. టీచర్స్ ఎమ్మెల్సీ మాదిరిగానే న్యాయవాదులకు కూడా ఒక ఎమ్మెల్సీ ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ లో కొత్తగా చేరే న్యాయవాదులకు ఆరు నెలల వరకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ఇస్తానని పేర్కొన్నారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల బీమా సౌకర్యాన్ని రూ.20 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ఎస్ బీఐ రూ.20 లక్షల బీమా వచ్చేలా కృషి చేస్తానన్నారు.
ఇందుకు మొదటి ప్రీమియం తనే చెల్లించి అందరికీ వచ్చేలా కృషి చేస్తానన్నారు. 30 ఏండ్లుగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.