- 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- రైతుల ఖాతాల్లో రూ.1,168 కోట్లు జమ
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగం పుంజుకుంది. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తూకం వేయించడం, అవసరమైన లారీలను సమకూర్చి కాంటా పెట్టిన వడ్ల బస్తాలను రైస్ మిల్లులకు తరలించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
ఫలితంగా ఇప్పటివరకు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, ఎఫ్‌పీఓల ద్వారా 1,28,706 మంది రైతుల నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జాప్యం లేకుండా ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రూ.1,168 కోట్లు జమయ్యాయి. ఈ నెలాఖరు వరకు సాధ్యమైనంత మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో యాసంగి సీజన్‌లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు 21 మండలాల పరిధిలో పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు మందగించగా, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్, డీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. ఇప్పటివరకు 59,227 మంది రైతుల నుంచి 2.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా అవసరమైన లారీలను సమకూరుస్తున్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన మేరకు ఇప్పటివరకు 39,879 మంది రైతుల ఖాతాల్లో రూ.441 కోట్లు జమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా మండలాల్లో ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సూచించారు.
సిద్దిపేట జిల్లాలో...
జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో 427 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మొత్తం 55,045 మంది రైతుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 32 వేల మంది రైతులకు సంబంధించిన 1.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.434 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో...
ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 92,560 ఎకరాల్లో వరి సాగు జరిగింది. అందులో 9,870 ఎకరాల్లో సన్న వడ్లు పండించినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు కలిపి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 39 రైస్ మిల్లులకు వాటి మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా అలాట్‌మెంట్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 633 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 14,434 మంది రైతుల నుంచి 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.293 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
