ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె. శ్రీనివాస్ చెప్పారు.   బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో 2023-–24 యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సివిల్‌‌‌‌ సప్లై శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కేంద్రాల ఇన్‌‌‌‌చార్జిలకు  సూచించారు.

ఎండల నేపథ్యంలో సెంటర్ల వద్ద  తాగునీరు, నీడ కోసం టెంట్లు వేయాలని,  ప్యాడీ, మాయిశ్చర్‌‌‌‌‌‌‌‌ మిషన్లు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా అవగాహన కల్పించాలన్నారు.  నిర్వాహకులు ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు పంపిస్తే చర్యలు ఉంటాయని, ఈ మేరకు అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు.  

ప్రభుత్వం  గ్రేడ్- ఏ ధాన్యానికి  రూ.2,203,  సాధారణ రకానికి  రూ. 2,183 మద్దతు ధర ఇస్తోందని,  ధరల పట్టికపై సెంటర్ల  వద్ద బ్యానర్లు పెట్టాలని సూచించారు.  లోకసభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో  కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు ఓపెన్ చేయవద్దని,  రాజకీయపరమై ఫ్లెక్సీలు ఉండకూడదని సూచించారు. లేదంటే  నిర్వాహకులపై కోడ్ ఉల్లంఘన కింద  కేసులు నమోదు అవుతాయని  హెచ్చరించారు.  

సివిల్‌‌‌‌ సప్లై, డీఆర్డీఏ, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, జిల్లా కో-ఆపరేటివ్, మార్కెటింగ్ , తూనికలు కొలతలు, ట్రాన్స్‌‌‌‌ఫోర్ట్‌‌‌‌ శాఖలు సమన్వయంతో పనిచేసి  రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో  సివిల్‌‌‌‌ సప్లై జిల్లా ఫీసర్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర్లు,  జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, డీఆర్డీవో  నాగిరెడ్డి, డీసీవో కరుణాకర్, డీఏవో శ్రవణ్, జిల్లా తూనికలు కొలతలు అధికారి రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.