మొదటి విడతకు ఏర్పాట్లు షురూ.. క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణ

మొదటి విడతకు  ఏర్పాట్లు షురూ.. క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణ

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్​ వెలువడనుంది. మెదక్ జిల్లాలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉండగా మొదటి విడతలో 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలు, 1,402 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్​ శాఖ అధికారులు ఆయా మండల పరిషత్​ ఆఫీసుల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. మండలంలో ఉన్న పంచాయతీల సంఖ్యను బట్టి మూడు, నాలుగు పంచాయతీలకు ఒక క్లస్టర్​ చొప్పున ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించనున్నారు. 

ఎన్నికల నిర్వహణకు పంచాయతీల సంఖ్యను 6 మండలాలకు 45 మంది స్టేజ్​ - 1 రిటర్నింగ్ ఆఫీసర్​ (ఆర్​ఓ)లను, 45 మంది అసిస్టెంట్​రిటర్నింగ్​ ఆఫీసర్​( ఏఆర్​ఓ)లను, 192 మంది స్టేజ్​-2 ఆర్​ఓలను, 1,682 మంది పోలింగ్ ఆఫీసర్​ (పీఓ)లను, 1,878 మంది అదర్​ పోలింగ్ ఆఫీసర్​( ఓపీఓ)లను, 35 మంది జోనల్​ఆఫీసర్లను, 35 మంది రూట్​ఆఫీసర్లను నియమించారు.  ఒక్కో వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్​ చొప్పున ఏర్పాటు చేస్తుండగా అందుకు అనుగుణంగా అవసరమైన బ్యాలెట్​ బాక్స్​లను ఆయా మండలాలకు చేరవేశారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో మొత్తం 508  గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా మొదటి విడతలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆయా మండలాల పరిధిలో క్లస్టర్ల ను ఏర్పాటు చేసి సర్పంచ్ , వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒక్కో  క్లస్టర్ లో 4 నుంచి 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డుల నామినేషన్లను స్వీకరిస్తారు.

 ఒక్కో  మండలంలో 6 నుంచి 8  క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో  క్లస్టర్ లో ఓఆర్​వో, ఏఆర్​వోతో పాటు వారికి సాయపడేందుకు మరో ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. గజ్వేల్ మండలంలో  8, వర్గల్ మండలంలో 6, ములుగు మండలంలో 7, మర్కుక్ మండలంలో 4, జగదేవ్ పూర్ మండలంలో 8,  రాయపోల్ మండలంలో 4, దౌల్తాబాద్ మండలంలో8  క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 9 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు మొత్తం 45 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. 

నిబంధనలు ఇలా..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి 21 ఏళ్లు నిండి అతడిని ప్రతిపాదించే వ్యక్తి సంతకం చేసిన నామినేషన్ ను నిర్ణీత సమయంలో సమర్పించాలి. ప్రతిపాదకుడు ఖచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో అభ్యర్థి గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.  అభ్యర్థితో పాటు  ప్రతిపాదకుడు ఇంటి టాక్స్ కట్టి గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. డిపాజిట్ రుసుం సర్పంచ్ అభ్యర్థికి రూ.2000, వార్డు అభ్యర్థికి రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధృవీకరణ ఇవ్వాలి లేదంటే నామినేషన్ ఫారంలోని పార్ట్ III లో డిప్యూటీ తహసీల్దార్ తో సంతకం చేయించాలి. 

ఎన్నికల అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్ పై సంతకం చేయాలి. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులకు 20, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు 20 సింబల్స్ ను అందుబాటులో ఉంచుతారు. తెలుగు అక్షర క్రమం ప్రకారం ఎన్నికల అధికారి అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు.

సంగారెడ్డి జిల్లాలో.. 

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 613 గ్రామ పంచాయతీలు, 5,370 వార్డు స్థానాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతగా సంగారెడ్డి  డివిజన్ పరిధిలో 7 మండలాల పరిధిలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఎంపీడీవో ఆఫీసుల్లో  ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు, నాలుగు పంచాయతీలకు ఒక క్లస్టర్ చొప్పున నామినేషన్లు స్వీకరించనున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్, రూట్ ఆఫీసర్లను నియమించి పర్యవేక్షిస్తున్నారు.