డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు..నలుగురు పంచాయతీ సెక్రటరీలు సస్పెండ్

డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు..నలుగురు పంచాయతీ సెక్రటరీలు సస్పెండ్

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలంలోని బుధాకుర్ద్, పెర్కపల్లి గ్రామపంచాయతీలలో అనధికారికంగా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నలుగురు పంచాయతీ కార్యదర్శులతో పాటు కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎంపీఓ కృష్ణవేణి వెల్లడించారు.

గ్రామపంచాయతీలలో ఎలాంటి అధికారిక దరఖాస్తులు, సంబంధిత రికార్డులు లేకుండానే రహస్యంగా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బుధాకుర్ద్, పెర్కపల్లి గ్రామాలకు చెందిన వారు కాని వ్యక్తుల పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం, అలాగే సదరు వ్యక్తులు ఆయా గ్రామాల్లో మరణించకపోవడంతో స్థానికంగా గందరగోళం నెలకొంది.

ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు.విచారణలో ఈ వ్యవహారానికి సహకరించినట్లు గుర్తించిన పంచాయతీ కార్యదర్శులు సాదుల్లా, శ్రీనివాస్, సాయిరాం, స్నిద్ధతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనును సస్పెండ్ చేసినట్లు ఎంపీఓ కృష్ణవేణి తెలిపారు.