
- కరెంటు బిల్లులు కట్టకుంటే వేటేస్తమంటే ఎట్లా?
- సర్కారు తీరుపై సర్పంచులు, కార్యదర్శుల అసహనం
- పంచాయతీలు, చిన్న మున్సిపాలిటీలకు ఆదాయం తక్కువ
- ఉన్న సిబ్బందికి నెల నెలా జీతాలకే పైసల్లేవు
- బిల్లులు కట్టేదానికి ఉద్యోగాలకు లింకేంది?
- కేంద్రమిచ్చే పైసలు టైముకు రావడం లేదు
- రాష్ట్ర సర్కారు నిధులు ఇచ్చిందే లేదని మండిపాటు
- కొత్త మున్సిపాలిటీల్లో పరిస్థితి మరింత దారుణం
సర్పంచ్‌లు సర్కారు మీద నారాజ్‌గున్నరు. ఊరికి సర్వీస్ జేద్దామని కష్టపడి ఎన్నికల్ల గెల్చినోళ్లను, మొక్కలెండిపోతే, కరెంట్ బిల్లు కట్టకుంటే… సస్పెండ్ జేస్తరా అని గరమైతున్నరు. సిఎం కేసీఆర్ సార్ మాత్రం ఈ విషయంలో ఎన్కకు పోయేదిలేదని గట్టిగనే అంటున్నరు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో గ్రామసభలు పెట్టలేదని జిల్లా కలెక్టర్ ఒక సర్పంచ్‌ను పదవి నుంచి తీసేసిండు. సర్కారు దెబ్బకు సర్పంచ్‌లు బేజారైతున్నరు.
హైదరాబాద్, వెలుగు:గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వేటు వేస్తామన్న సర్కారు నిర్ణయంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు మండిపడుతున్నారు. ‘‘కరెంటు బిల్లులు నెలనెలా కట్టాలంటే ఏ ఒక్కరి పదవి కూడ ఉండది. అందరికీ ఊస్టింగే.. గ్రామాల్లో పంచాయతీలకు వచ్చే నిధులతో పోలిస్తే ఖర్చులే ఎక్కువ. కేంద్ర నిధులు సకాలంలో రావు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇప్పటికీ ఇచ్చింది లేదు. ఇట్లయితే కరెంటు బిల్లులు ఎక్కడి నుంచి కడ్తం.. మేమేమన్న అల్కగ దొరికినమా?’’అంటూ బాధపడుతున్నారు. ముందు నిధులు సరిగా ఇవ్వాలని, ప్రతిదానికి పదవులతో ముడిపెట్టడాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇట్ల ముడిపెడితే ఎట్లా..?
సకాలంలో కరెంటు బిల్లులు కట్టకపోతే గ్రామాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతే సర్పంచులు, కార్యదర్శులపై వేటు తప్పదని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కొత్త పంచాయతీరాజ్చట్టంలోనూ ఆ అంశాన్ని పొందుపర్చింది. దానిపై ఇప్పటికే అసంతృప్తి చెలరేగగా.. ఇప్పుడు కరెంటు బిల్లుల బాకీలకు, పదవులకు ముడిపెట్టిన తీరు దుమారం రేపుతోంది. అధికారులు, నేతల ఒత్తిళ్లు ఒక వైపు, తగిన శిక్షణ లేకపోవడం మరోవైపు ఇబ్బందిగా మారడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే రాజీనామాల బాట పట్టారు. అలాంటిది ఇప్పుడు కరెంటు బిల్లుల అంశంతో షాక్‌కు గురవుతున్నారు.కరెంటు బిల్లులకు, తమ ఉద్యోగాలకు లింకేమిటని ప్రశ్నిస్తున్నారు.
బకాయిలు కట్టగానే సరిపోదు..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల కరెంటు బిల్లుల బకాయిలు రూ.2,973 కోట్లు దాటాయి. ప్రభుత్వం వీటన్నింటినీ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద కట్టేస్తామని చెప్పింది. కానీ తర్వాతైనా పంచాయతీలు, చిన్న మున్సిపాలిటీలు నెలనెలా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. వాటికొచ్చే ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేదని.. గ్రాంట్లు కూడా సకాలంలో రాక సమస్యగా మారిందని అంటున్నాయి.
కొత్త మున్సిపాలిటీల్లో దారుణం
కొత్త మున్సిపాలిటీల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్రంలో 60 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటై ఆగస్టు 2వ తేదీకి ఏడాదైంది. ఇప్పటివరకు వీటికి ఒక్క రూపాయి గ్రాంటు కూడా విడుదల కాలేదు. అసలు వీటికి ఇన్చార్జులే కమిషనర్లుగా ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేక వసూళ్లు లేవు. ప్రభుత్వం నిధులేమీ ఇవ్వకపోవటంతో సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ శివార్లలోని కొత్తపల్లిని కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. పంచాయతీగా ఉన్నప్పటి కరెంటు బకాయిలే రూ.2.24 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు సర్కారు బకాయిలు కట్టేసినా.. తర్వాత ప్రతి నెలా సుమారు రూ. 20 లక్షలకుపైగా వచ్చే కరెంటు బిల్లులు భరించే స్తోమత మున్సిపాలిటీకి లేదు.
వేటు వేస్తామంటే ఎట్లా?
మా మేజర్ పంచాయతీ పరిధిలో 300కుపైగా స్ట్రీట్ లైట్లు, 3 వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటికి నెలకు రూ.50 వేలు కరెంటు బిల్లొస్తది. కొన్నేళ్లుగా రూ.2 లక్షలకుపైగా బిల్లు పెండింగ్‌లో ఉంది. జనరల్ ఫండ్ నుంచి నెలకు కొంత కడుతూ వస్తున్నం. 22 మంది సిబ్బందికి నెలకు రూ.1.12 లక్షల జీతాలు ఇవ్వాలి. పంచాయతీ నిర్వహణ వ్యవమూ కలిపి నెలకు రూ.2 లక్షల దాకా ఖర్చవుతుంది. కానీ నెలకు వచ్చే ఆదాయం రూ.30 వేలే. గతంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 30 శాతం బిల్లులు కట్టేందుకు అనుమతిచ్చినా బకాయిలు క్లియర్ కాలేదు. ఇలాంటప్పుడు పంచాయతీలే బిల్లులు కట్టుకోవాలె. లేకుంటే వేటు వేస్తమంటే ఎట్లా?
‑ జక్కు భూమేశ్, మంచిర్యాల జిల్లా పొన్కల్ సర్పంచ్
ముందు నిధులివ్వండి
పంచాయతీ విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే సర్పంచులపై వేటు వేస్తామనడం సరికాదు. పంచాయితీల అభివృద్ధికి నామమాత్రంగా నిధులిస్తున్నారు. ఊర్లో పారిశుధ్యం, వీధిదీపాలు, మురికి కాల్వల నిర్మాణం, తాగునీరు వంటి వాటికే నిధులు సరిపోవడం లేదు. విద్యుత్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
– వల్లంపట్ల ఝాన్సీ, నల్గొండ జిల్లా ఆమనగల్లు సర్పంచ్
జేబుల్లోంచి బిల్లులు కట్టలేరుగా
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నిధులిస్తే కరెంట్ బిల్లులు కట్టడం సర్పంచ్‌లకు ఇబ్బందేమీ కాదు. కానీ ఇప్పటికీ జీపీలకు వస్తున్నది కేంద్ర నిధులే. గతంలో 14వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పుడు కూడా 30 నుంచి 50 శాతం నిధులను కరెంట్ బిల్లుల కిందనే కట్ చేసుకున్నరు. పంచాయతీలకు పట్టణాల్లా ఆర్థిక వనరుల్లేవు. చిన్న పంచాయతీల ఆదాయం ఐదారువేలకు మించే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయాలి. కరెంట్ బిల్లులను సర్పంచ్‌లు జేబుల నుంచి కట్లలేరు కదా.
– కృష్ణ, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు
సీఎం నిర్ణయం అవివేకం
పంచాయతీలు సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే సర్పంచ్‌లపై వేటు తప్పదని సీఎం హెచ్చరించడం అవివేకం, అర్థ రహితం. గ్రామాల్లో స్ట్రీట్ లైట్ల వ్యవస్థ సరిగా లేదు. వాటికి మీటర్లుండవు. అవి ఏ కేటగిరీ కిందకు వస్తయో తెలియదు. ఏ ప్రాతిపదికన బిల్లు చెల్లించాలి. ఎన్నికై ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు సర్పంచ్‌లకు చెక్ పవరే రాలేదు. సొంత నిధులతో పనులు చేస్తున్నం. బిల్లులు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలా, ఆర్థిక సంఘ నిధుల నుంచా చెప్పాలి.
– సంధ్యారాణి, మెదక్ జిల్లా మాచవరం సర్పంచ్