అక్టోబర్ నెలలో కార్లు, బైక్స్ ఎగబడి కొన్నారు.. గత ఏడాది కంటే 40% అప్.. కంపెనీల పంట పండింది

అక్టోబర్ నెలలో కార్లు, బైక్స్ ఎగబడి కొన్నారు.. గత ఏడాది కంటే 40% అప్.. కంపెనీల పంట పండింది

భారత ఆటోమొబైల్ పరిశ్రమ అక్టోబర్ నెలలో చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. దేశీయ వినియోగం పుంజుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అన్ని వాహన విభాగాల్లో రిటైల్ అమ్మకాలు ఏకంగా 40.5 శాతం పెరిగాయి.

ఈసారి అమ్మకాల్లో ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్స్ రెండూ జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయని ఫాడా అధ్యక్షుడు సి.ఎస్. విజయేశ్వర్ అన్నారు. పండక్కి ప్రజల నుంచి కొనుగోలు ఉత్సాహంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ టాక్స్ తగ్గింపులు జోష్ నింపాయని ఆయన అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటా కలిగి ఉంది. మొత్తం తయారీ రంగంలో సగానికి సమానంగా ఈ రంగం వాటా ఉంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ అతిపెద్ద వాహన ఉత్పత్తిదారుగా నిలిచింది. అమెరికాకు వెళ్లే వాహన ఎగుమతులు దేశ జీడీపీలో సుమారు 2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ.. అంతర్గత డిమాండ్ పెరగటం ఆ లోటును పూరిస్తోందని తెలుస్తోంది. ఈ అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఏడాదికి 11 శాతం పెరిగి 5.57 లక్షల యూనిట్లకు చేరుకోగా.. స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల సేల్స్ 52 శాతం పెరిగి 31.5 లక్షల యూనిట్లను తాకింది. దీని వెనుక గ్రామీణ డిమాండ్, జీఎస్టీ తగ్గింపు, పండుగల సీజన్ వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. 

మెుత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల కొనుగోలు ఊపందుకోవటం ఆటోమొబైల్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ భారతదేశంలో రాబోయే మూడునెలలపాటు డిమాండ్ బలంగా కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పురుష జనాభాలో 40 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందే ప్రాంతాలను ఫాడా గ్రామీణ ప్రాంతాలుగా వర్గీకరిస్తుంది. ఈ ట్రెండ్ చూస్తే.. భారత ఆటోమొబైల్ రంగం భవిష్యత్తు మరింత సానుకూలంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.