అక్టోబర్ 10 నుంచి బతుకమ్మ పండుగ.. 18న ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై సద్దుల సంబురం

అక్టోబర్  10 నుంచి బతుకమ్మ పండుగ..  18న ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై సద్దుల సంబురం
  • 10 రోజులపాటు రవీంద్రభారతిలో సాంస్కృతిక వేడుకలు
  • ఘనంగా నిర్వహించాలని అధికారులకు సర్కారు ఆదేశం
  • తెలంగాణ గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌ థీమ్‌‌‌‌‌‌‌‌తో బతుకమ్మ స్పెషల్​ లోగో

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ నిర్ణయించింది. పండుగ ముగింపు రోజైన 18న సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని హైదరాబాద్‌‌లోని ట్యాంక్‌‌బండ్‌‌పై భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వేడుకల నిర్వహణకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి వేలాది మంది ఆడపడుచులతో భారీ బతుకమ్మ ర్యాలీ నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.

అనంతరం సాయంత్రం 5  నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌‌బండ్‌‌పై వేడుకలు నిర్వహించనున్నారు. తర్వాత బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో బతుకమ్మల  నిమజ్జనానికి ప్రత్యేక ప్లాట్‌‌ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, నగరంలో ఎక్కడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా 18న ట్యాంక్‌‌బండ్ పరిసర ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు విధించనున్నారు. మహిళల భద్రత కోసం పటిష్టమైన బారికేడింగ్, సీసీ కెమెరాల నిఘా, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

హైదరాబాద్‌‌లోని ప్రధాన కూడళ్లను బతుకమ్మ ఆకృతులు, రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా, తెలంగాణ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతిలో పది రోజులపాటు ప్రత్యేక బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం ఉట్టిపడేలా కార్యక్రమాలు చేపట్టాలని పర్యాటక, సాంస్కృతిక శాఖకు ఆదేశాలు అందాయి. 

గ్లోబల్ సమిట్ థీమ్‌‌తో ప్రత్యేక లోగో

తెలంగాణ ఖ్యాతిని, మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం బతుకమ్మకు ప్రత్యేక లోగోను రూపొందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమిట్ అంశం ప్రతిబింబించేలా ఈ లోగోను తీర్చిదిద్దనున్నారు. మన సంస్కృతిని చాటిచెబుతూనే, రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై నిలిపేలా లోగో డిజైన్ చేస్తున్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా పండుగను చిరస్మరణీయంగా నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. 

9 రోజులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: సీఎస్​

 బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్​ సంజయ్ జాజు వెల్లడించారు.  సచివాలయంలో బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు.  ఈనెల 18న సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్ బండ్​పై వేలాది మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాన్ని  అత్యంత వైభంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 18న సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్​పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు.

ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్​లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమిట్​ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు.