తెలంగాణ రైజింగ్’ సమిట్కు గ్రాండ్గా ఏర్పాట్లు

తెలంగాణ రైజింగ్’ సమిట్కు గ్రాండ్గా ఏర్పాట్లు
  • ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరవుతారు
  • ఏ లోటు రాకుండా సౌకర్యాలు కల్పించాలి
  • అధికారులకు సీఎం రేవంత్ ​రెడ్డి ఆదేశం
  • పాసులు లేనోళ్లను అనుమతించొద్దని స్పష్టీకరణ
  • సమిట్​ ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలన

హైదరాబాద్, వెలుగు :  ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమిట్​కు​ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, వివిధ దేశాల అంబాసిడర్లు హాజరవుతున్నారని.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, ఏర్పాట్లలో 
రాజీపడొద్దని ఆయన స్పష్టం చేశారు.  మీడియా ప్రతినిధులకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిసెంబర్​ 8, 9 తేదీల్లో భారత్​ ఫ్యూచర్​ సిటీ వేదికగా జరగనున్న ‘తెలంగాణ రైజింగ్’​ గ్లోబల్​ సమిట్​ ఏర్పాట్లను ఆదివారం సీఎం రేవంత్​రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, సమిట్​ నిర్వహణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని ఆయన ఆదేశించారు.  తాను ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని అధికారులకు తెలిపారు.

పాస్ లేకుంటే నో ఎంట్రీ

భద్రత విషయంలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఇవ్వకూడదు. పాసులు లేకుండా ఎవరు వచ్చినా లోపలికి అనుమతించొద్దు. శాఖల వారీగా అధికారులకు కేటాయించిన ఎంట్రీ పాయింట్ల ద్వారానే అనుమతించాలి’’ అని తేల్చిచెప్పారు. ట్రాఫిక్, పార్కింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే, బందోబస్తు కోసం వచ్చే పోలీస్ సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

నిర్మాణ పనుల పరిశీలన

సమిట్ ఏర్పాట్ల పరిశీలన అనంతరం.. భారత్ ఫ్యూచర్ సిటీలో శరవేగంగా జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులను కూడా సీఎం పరిశీలించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ స్కిల్స్ యూనివర్సిటీ’ నిర్మాణ పనులను, అలాగే ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ భవన నిర్మాణ పనులను ఆయన గమనించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.