నిజామాబాద్, వెలుగు: రానున్న లోకల్బాడీ ఎన్నికలను ప్రజలు ఈజీగా తీసుకోవద్దని, పదేండ్ల బీఆర్ఎస్ అప్పుల పాలనను గుర్తుచేసుకోవాలని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి కోరారు. ఆదివారం నిజామాబాద్‌లో మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రెసిడెంట్‌గా ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ విధ్వంస పాలనలో జరిగిన నష్టాలను సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నారని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్‌కు ఫీజు కడుతున్నామని, సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని, జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు, యూనివర్సిటీ తమ పాలనలోనే వచ్చాయన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీ కూడా తెచ్చామన్నారు. వీటిని ఇవ్వడానికి బీఆర్ఎస్ పాలకులకు చేతకాలేదని విమర్శించారు.
మంత్రిగా డి.శ్రీనివాస్ నగర పాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురాగా, తాను బోధన్‌కు రూ.22 కోట్ల వాటర్ స్కీమ్ మంజూరు చేయించానన్నారు. ఈ రెండు పనులను బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయించలేకపోయిందన్నారు. డి.శ్రీనివాస్ ప్రోత్సాహం వల్లే తాను 1989లో పాలిటిక్స్‌లోకి వచ్చానని ఎంతో స్నేహంగా ఉండేవారమన్నారు. ఆయన కుమారుడు మాజీ మేయర్ సంజయ్‌కు తప్పకుండా ప్రభుత్వ పదవిని ఇస్తామన్నారు.
కాపు సంఘానికి నిధులు : షబ్బీర్‌అలీ
శివాజీనగర్ మున్నూరు కాపు సంఘానికి రూ.38 లక్షలు ఇచ్చామని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ తెలిపారు. మరికొన్ని సంఘాలకు రూ.35 లక్షలు ఇచ్చామన్నారు. మున్నూర్ కాపులతో కాంగ్రెస్‌కు విడదీయలేని బంధం ఉందన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన శివశంకర్ వల్లే తాను కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ఎదిగానన్నారు.
డి.శ్రీనివాస్ అంచనా తప్పలే..
ఇందూర్ జిల్లా రాజకీయ నేతలుగా అర్గుల్ రాజారామ్, డి.శ్రీనివాస్ చిరస్మరణీయులని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. చరిత్రలో వారి పేరు నిలిచిపోయిందన్నారు. డి.శ్రీనివాస్ పిలుపుమేరకు ఎన్ఎస్యూఐ జిల్లా ప్రెసిడెంట్‌గా రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తాను పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని డి.శ్రీనివాస్ ముందే అంచనా వేశారని గుర్తు చేశారు. తండ్రి బాటలో ఆయన కొడుకు డి.సంజయ్ మున్నూరు కాపు సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకావడం శుభసూచకమన్నారు.
తనకు అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని ధర్మపురి సంజయ్ అన్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, ధర్మపురి సురేందర్, పుప్పాల శోభ తదితరులు పాల్గొన్నారు.
డెవలప్మెంట్ పనులకు భూమిపూజ
ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పలు డెవలప్మెంట్ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. నందిపేట శివారులోని జన్నేపల్లి మెయిన్ రోడ్డు నుంచి లక్కంపల్లి, చింరాజ్‌పల్లి, తల్వెద వరకూ రూ.6.93 కోట్ల పనులకు భూమిపూజ చేశారు. రూ.2.28 కోట్లతో ఆంధ్రానగర్-, ఇందిరానగర్, లక్ష్మాపూర్ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఐలాపూర్‌లో రూ.2.45 కోట్లతో నిర్మించే ఎస్సీ హాస్టల్ పనులకు పూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఉన్నారు.
