రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
  • మరో నెల రోజుల్లో 1,310 గృహప్రవేశాలు
  • ఆర్థిక స్థోమత లేని మహిళా సంఘాల సభ్యులకు రూ.10 కోట్ల రుణాలు
  • రాజన్నసిరిసిల్ల జిల్లాకు 7,918 ఇండ్లు మంజూరు

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పకడ్బందీగా అమలవుతోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇండ్ల నిర్మాణాలు  జెట్ స్పీడ్​తో జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో 1,310 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకోనున్నారు. ఇన్నాళ్లూ సొంతిల్లు లేక ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు తమ కల నెరవేరుతోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

5,496 ఇండ్లకు ముగ్గు

జిల్లాకు మొదటి, రెండో విడతల్లో కలిపి మొత్తం 7,918 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే 5,496 ఇండ్లకు ముగ్గు పోయగా.. 4,215 బేస్​మెంట్ దశ పూర్తి చేసుకున్నాయి. 2,322 ఇండ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయి. 53 మంది లబ్ధిదారులు ఇప్పటికే గృహప్రవేశాలు సైతం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా వివిధ కారణాలతో నిర్మించుకోలేమని 500 మంది లబ్ధిదారులు ఆఫీసర్లకు తెలిపారు. 

ఎస్ హెచ్ జీ సభ్యులకు రుణాలు

ఇందిరమ్మ ఇండ్లు మంజూరై, నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేని ఎస్​హెచ్ జీ సభ్యులకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆర్థికంగా ఇబ్బందులున్న 900 మంది మహిళలను గుర్తించిన అధికారులు రూ.10 కోట్ల రుణాలు ఇచ్చారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించి రుణాలను ఇస్తున్నారు.

లబ్థిదారులే అప్​లోడ్ చేసే అవకాశం

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం లబ్ధిదారుల ఇంటి నిర్మాణ ఫొటోలను యాప్​లో అప్​లోడ్ చేసే అవకాశం కల్పించారు. ప్లే స్టోర్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, బేస్ మెంట్ వరకు పూర్తి చేసుకున్న ఇంటి ఫొటోను అప్​లోడ్​ చేసి, వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత హౌసింగ్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, జీపీ సెక్రటరీలు వచ్చి, సదరు నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలుంటే 18005995991 టోల్ ఫ్రీ నంబర్​లో సంప్రదించాలని చెబుతున్నారు.