ఖమ్మం జిల్లాలో తేలిన జీపీ రిజర్వేషన్లు!..సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో తేలిన జీపీ రిజర్వేషన్లు!..సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
  • 50 శాతం లోపు పరిమితితో రిజర్వేషన్ల ఖరారు 
  • మహిళలు పోటీ చేసే సీట్లు లాటరీ ద్వారా ఎంపిక 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీనికి సంబంధించిన గెజిట్ ను కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి విడుదల చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తి చేశారు. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎంపీడీవోలు కల్పించారు. సర్పంచ్​ పదవుల్లో బీసీలకు కులగణన ఆధారంగా, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఆర్డీవోలు రిజర్వు చేశారు. జిల్లాలో 11 పంచాయతీల్లో 100 శాతం గిరిజనుల జనాభా ఉండగా, 99 షెడ్యూల్డ్ పంచాయతీలను ఎస్టీలకు రిజర్వ్​ చేశారు. 

మిగిలిన 461 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్​, వార్డు సభ్యులకు 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మిగిలిన 50 శాతం జనరల్​ కు రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు పోగా మిగిలిన పంచాయతీల్లోని వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేశారు. లాటరీ ద్వారా మహిళలకు రిజర్వ్ చేశారు. ఒక్కో మండలంలోని గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్​ లు, వార్డు సభ్యుల జాబితాను ఒక్కచోటకు చేర్చి డీపీవో ద్వారా కలెక్టర్​ కు అందజేశారు. 

 సర్పంచ్​ లు ఇలా..

జిల్లాలో571 గ్రామ పంచాయతీలున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో 48 గ్రామ పంచాయతీలు ఎస్టీ మహిళలకు, 51 గ్రామ పంచాయతీలు ఎస్టీ జనరల్​ కు కేటాయించారు. ఇక 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న 11 జీపీల్లో 8 ఎస్టీ జనరల్​ కు, 3 ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఎస్టీ జనరల్​ కు 36, ఎస్టీ మహిళలకు 25, ఎస్సీ జనరల్​ కు 62, ఎస్సీ మహిళలకు 48, బీసీ జనరల్​ కు 30, బీసీ మహిళలకు 24 రిజర్వ్ చేశారు. 124 జీపీలు జనరల్​ కు రిజర్వ్ చేయగా, మిగిలిన 112 జీపీ సర్పంచ్​ లను జనరల్​ మహిళలకు రిజర్వ్ చేశారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇలా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గ్రామపంచాయతీల సర్పంచ్​లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఆదివారం రాత్రి ఆఫీసర్లు ఫైనల్ చేశారు. జిల్లాలోని 22 మండలాల్లో 471 పంచాయతీలున్నాయి. ఎస్టీ జనరల్ 234, ఎస్టీ మహిళ 226, ఎస్సీ జనరల్ 2, అన్ రిజర్వ్డు​(జనరల్ )5, జనరల్ మహిళ 4 గ్రామపంచాయతీలు సర్పంచ్లకు రిజర్వేషన్ అయ్యాయి. సర్పంచ్ల విషయంలో బీసీలకు ఒక్క గ్రామపంచాయతీ లేకపోవడం గమనార్హం. 

వార్డులలో ఇలా..

జిల్లాలో 4,168 గ్రామపంచాయతీ వార్డులున్నాయి. ఎస్టీ జనరల్ 1,420, ఎస్టీ మహిళ1,228, ఎస్సీ జనరల్ 13, ఎస్సీ మహిళ 5, బీసీ జనరల్ 10, బీసీ మహిళ 7, జనరల్ 840, జనరల్ మహిళ  645 వార్డులతో రిజర్వేషన్లను ఆఫీసర్లు ఫైనల్ చేశారు.

వార్డు సభ్యులు ఇలా..

జిల్లాలోని 571 జీపీల్లో 5,214 వార్డులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియా జీపీల్లో 312 వార్డులు ఎస్టీ జనరల్​ కు, 279 ఎస్టీ మహిళలకు కేటాయించారు. 100 శాతం ఎస్టీ జీపీల్లో 42 వార్డులు ఎస్టీ జనరల్​ కు, 42 వార్డులు ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. నాన్​ షెడ్యూల్డ్ ఏరియాలో 292 వార్డులు ఎస్టీ జనరల్​ కు, 194 వార్డులు ఎస్టీ మహిళలకు, 559 వార్డులు ఎస్సీ జనరల్​ కు, 376 వార్డులు ఎస్సీ మహిళలకు, 434 వార్డులు బీసీ జనరల్​ కు, 263 వార్డులు బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు. మొత్తంలో 1,323 జనరల్​ కు కేటాయించగా, 1,098 వార్డులు జనరల్​ మహిళలకు రిజర్వ్ చేశారు.