
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రజాప్రతినిధులు, పలుపార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రలను షురూ చేశారు. రంగురంగుల పూలతో రథాలను అలంకరించి పల్లెలు, పట్టణాల్లో ఊరేగింపు నిర్వహించారు.
జై బోలో గణేశ్మహారాజ్కీ జై.. మహాగణపతికి జై.. అన్న నినాదాలు మార్మోగాయి. డోలు వాయిధ్యాల మధ్య నృత్యాలు చేస్తూ శోభాయాత్రలను కొనసాగించారు. మహిళలు, చిన్నారులు కోలాటం ఆడడం ఆకట్టుకుంది. నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లోని నిమజ్జన బావిలో గణేశులను నిమజ్జనం చేశారు. కామారెడ్డిలోని చెరువులో వినాయకులను నిమజ్జనం చేశారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో చెరువులు, కుంటల్లో గణనాథులను నిమజ్జనం చేసి వెళ్లి రా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ గణపతికి వీడ్కోలు పలికారు. - వెలుగు, నెట్వర్క్