- ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
- ఆయా చోట్ల మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల హాజరు
నెట్వర్క్, వెలుగు : పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమం సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్‌పల్లిలో మంత్రి దామోదర రాజనర్సింహ, భువనగిరిలో ఎంపీ చామాల కిరణ్కుమార్, ఆలేరు, యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథులుగా హాజరై లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఆయా నియోజక వర్గాల్లోని పలుచోట్ల ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జైవీర్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, పద్మావతి రెడ్డి, నేనావత్ బాలునాయక్, కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్లు ప్రతీక్ జైన్, ఆదర్శ్ సురభి, బడుగు చంద్రశేఖర్, అనురాగ్ జయంతి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్ల పాలనలో నిరుపేదలను ఆదుకోవడంలో, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేదలు లేకుండా వచ్చే ఏడాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా, నాణ్యతతో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన, నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు.
