- స్వామికి చక్రస్నానం, జలక్రీడల వల్లివేట ఉత్సవాలు
దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని అభినవ శబరిమలై అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఆదివారం పంబా ఆరట్టు, చక్రస్నాన జలక్రీడల వల్లివేట మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు గురుస్వామి, శ్రీమాన్ శ్రీ చక్రవర్తుల పురుషోత్తమ చార్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవ పూజలు చేసి పల్లకి సేవ నిర్వహించారు.
మంగళవాయిద్యాల నడుమ అయ్యప్ప భక్తుల భజనలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారికి కోనేరులో శ్రీచక్ర స్నానం చేయించి, జల క్రీడలాడించారు. అనంతరం అరట్టు ఉత్సవపూజ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామికి పంచమృత అభిషేకాలు, పుష్పాభిషేకం, మంత్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప శరణుఘోషతో మారుమోగింది.
గూడెంలో అయ్యప్పస్వామి దీక్ష స్వీకరించిన రాష్ట్ర మంత్రి లక్ష్మణ్
గూడెం అయ్యప్ప స్వామి మందిరంలో ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయ్యప్పస్వామి మాలాధారణ దీక్ష స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపకులు గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమచార్యులు చేతుల మీదుగా మంత్రి మాలధారణ చేశారు. మంత్రి ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
