తెలంగాణకు 16కోట్ల పారాసెటమాల్ మాత్రలు

తెలంగాణకు 16కోట్ల పారాసెటమాల్ మాత్రలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి 16 కోట్ల పారాసెటమాల్ మాత్రలు ఉచితంగా ఇవ్వాలని గ్రాన్యూయెల్స్‌ ఇండియా సంస్థ నిర్ణయించింది. వీటి విలువ 8 కోట్లు అవుతుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న పారాసెటమాల్ మాత్రలను ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేందుకు గ్రాన్యుయెల్స్ ఇండియా ముందుకొచ్చింది. గ్రాన్యూయాల్స్‌ ఇండియా యాజమానులు కృష్ణ ప్రసాద్, ఉమాదేవి చిగురుపాటి దంపతుల తరపున కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలసి సంస్థ నిర్ణయాన్ని తెలియజేశారు. పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లను తయారీలో ప్రముఖ కంపెనీ అయిన గ్రాన్యుయెల్స్ తన వంతు సాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారానికి ఒక కోటి మాత్రలు(500 ఎంజీ) చొప్పున రాష్ట్రానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. రానున్న నాలుగు నెలల పాటు వారానికి కోటి చొప్పున 16 కోట్ల మాత్రలను కంపెనీ ఉచితంగా రాష్ట్రానికి అందిస్తుందని పేర్కొన్నారు.