దోమల కట్టడిపై స్పెషల్ ఫోకస్ .. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్

దోమల కట్టడిపై స్పెషల్ ఫోకస్ .. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్
  • క్షేత్రస్థాయిలో దోమల నియంత్రణకు చర్యలు
  • ఎక్కడికక్కడ యాంటీ లార్వా యాక్టివిటీస్
  • ఇప్పటికే 618 ప్లాట్ల యజమానులకు నోటీసులు
  • సొంతంగా క్లీన్ చేసుకోకపోతే జరిమానాల విధింపు

హనుమకొండ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు సీజనల్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి జ్వరాలు ప్రబలుతుండటంతో దోమల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. నగరంలో డివిజన్ల వారీగా యాంటీ లార్వా యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. టౌన్ తో పాటు విలీన గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇండ్ల మధ్య ఉన్న ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి, దోమలకు ఆవాసంగా మారుతుండగా, వాటిని ప్లాట్ల యజమానులే క్లీన్ చేసుకునేలా నోటీసులు జారీ చేస్తున్నారు. 

ఓపెన్ ప్లాట్లకు నోటీసులు

జీడబ్ల్యూఎంసీ పరిధిలో 42 విలీన గ్రామాలను కలుపుకొని 66 డివిజన్లు ఉండగా.. 1,800కుపైగా కాలనీలున్నాయి. కాగా నగరంలోని వివిధ కాలనీల్లో మొత్తంగా 2,400కుపైగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. చాలా వాటిలో పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయి దోమలకు నిలయంగా మారాయి. దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు దోమల నియంత్రణలో భాగంగా ఓపెన్ ప్లాట్లపై ఫోకస్ పెట్టారు.  ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారం, మురుగునీరు, ఇతర వ్యర్థాలు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని దోమలకు ఆవాసంగా మారిన ప్లాట్లను గుర్తిస్తున్నారు. సంబంధిత ఓనర్లకు నోటీసులు జారీ చేసి, సొంతంగా ప్లాట్లను క్లీన్ చేసేలా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు నగరంలోని 618 ఓపెన్ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. సంబంధిత ఓనర్లు రెస్పాండ్ కాకపోతే వారికి ఫైన్లు విధించేలా కసరత్తు చేస్తున్నారు.

విష జ్వరాలు ప్రబలకుండా యాక్షన్

శానిటేషన్ సమస్యలు, ఇటీవల కురిసిన వర్షాల వల్ల క్షేత్రస్థాయిలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు అర్బన్ మలేరియా వింగ్ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. డివిజన్ల వారీగా ప్రత్యేకంగా టీమ్ లను ఏర్పాటు చేసి విష జ్వరాలు ప్రబలే హై రిస్క్ ఏరియాలను గుర్తిస్తున్నారు. వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టి దోమలు వృద్ధి చెందకుండా యాక్షన్​ తీసుకుంటున్నారు. రూ.54 లక్షలతో దోమల నివారణకు  ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయడం, మాలాతిన్, టెమోఫాస్, పెరిత్రిన్ లాంటి కెమికల్స్  స్ప్రే చేస్తున్నారు. 

అర్బన్ మలేరియా వింగ్ లో ఉన్న 180 మందితో పాటు 2,873 పీహెచ్ వర్కర్స్ ను ప్రత్యేక టీమ్ లుగా విభజించారు. ఒక్కో డివిజన్ కు దాదాపు 30 మందితో శానిటేషన్ ఇన్ స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ గ్యాంగ్ వర్క్స్ చేపట్టి యాంటీ లార్వా యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విష జ్వరాలు ప్రబలకుండా దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

పక్కా ప్రణాళికతో  దోమల నివారణ

గ్రేటర్​ వరంగల్ పరిధిలో దోమల నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఫాగింగ్, కెమికల్స్ స్ప్రే చేస్తున్నాం. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టేలా ఓపెన్ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. అయినా వినని వారికి జరిమానాలు విధిస్తాం. 

డా.రాజారెడ్డి, సీఎంహెచ్​వో, జీడబ్ల్యూఎంసీ