
నిర్మల్,వెలుగు: హరితహారం పథకంతోనే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ మారుతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి రత్నాపూర్ కాండ్లి, మంజులాపూర్ గ్రామాల్లో మొక్కలు నాటి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ముందర విధిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడీదారులకు ఊడిగం చేస్తున్రు
ఆసిఫాబాద్,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడీదారులకు ఊడిగం చేస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాలరాజు ఫైర్అయ్యారు. ఏఐటీయూసీ జిల్లా మూడో మహాసభలు ఆదివారం ఆసిఫాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లీడర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ అధ్యక్షతన మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, లీడర్లు సుధాకర్, ఇంద్రు, వెంకటేశ్, లక్ష్మణ్, మోహన్ బాబు పాల్గొన్నారు.
కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి
కుభీరు,వెలుగు: వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని టీజేఎస్ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని హల్దా గ్రామానికి చెందిన రైతులు గంగాధర్, రాథోడ్ తానాజీ ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా ఆదివారం ఆయన ఆయా కుటుంబాలను పరామర్శించారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. పరిహారం అందించి ఆదుకోవాలన్నారు.
బీజేపీలో చేరికలు
ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్ కు చెందిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి ఆదివారం బీజేపీ చేరారు. మునుగోడు సభ సందర్భంగా అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ ప్రొటోకాల్ కారణంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్‌ను ఏయిర్‌పోర్టులో కలిశారు. ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
అధికారంలోకి రావడమే లక్ష్యం
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కోరారు. మండలంలోని జందాపూర్ గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో లీడర్లు ఆదినాథ్, దినేశ్ మటోలియ, మయూర్ చంద్ర, రత్నాకర్ రెడ్డి, మహేశ్, సురేశ్, ముకుంద్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్టూడెంట్లకు ఫ్రీ బస్ సౌలత్ కల్పించాలి
మందమర్రి,వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని వైఎస్సార్టీపీ జిల్లా యువత అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, జనరల్ సెక్రటరీ సుద్దాల ప్రభుదేవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మందమర్రిలో వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కాన్వాయ్పేరుతో పెద్ద సంఖ్యలో వాహనాలు వినియోగిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అదే సొమ్ముతో సర్కార్ స్కూళ్లలో చదువుకుంటున్న పేద పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో మెరుగైన విద్య అందించడంలో సర్కార్ విఫలమైందన్నారు. సమావేశంలో లీడర్లు ఓరం కవిరాజ్, గద్దె సాయి కిశోర్, అరుణ్తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలో 15 శాతం రిజర్వేషన్లు అడిగాం
నస్పూర్,వెలుగు: ఇతర యూనివర్సిటీలు ఇస్తున్నట్లుగానే మెడికల్ కాలేజీలో కూడా సింగరేణియులకు15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరినట్లు సింగరేణి డైరెక్టర్ బలారం తెలిపారు. ఆదివారం సీసీసీలో ఆఫీసర్స్ క్లబ్ ను ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం లాభాలు ఎంత అనేది ఇంకా లెక్క తేలలేదన్నారు. ఈసారి గతంకంటే మెరుగైన లాభాలే వస్తాయన్నారు. సింగరేణికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదని, వివిధ సంస్థల నుంచి వచ్చేవి వస్తున్నాయన్నారు. సంస్థ సోలార్ పవర్‌పై కూడా దృష్టి పెట్టిందన్నారు. సంక్షేమంలో సంస్థ ఎప్పుడూ ముందుంటుందని బలరామ్ వివరించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ, సింగపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీల వద్ద నిర్మించిన కమ్మూనిటీ హాళ్లను ఎమ్మెల్యే దివాకర్ రావు తో కలిసి ప్రారంభించిన సందర్భంగా బలరామ్ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో జీఎం సంజీవ రెడ్డి, ఆఫీసర్లు శివరావు, గోవిందరాజు, సత్యనారయణ, వెంకట్ రెడ్డి, సంతోష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, విజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.
గెలుపు పొందు వరకూ..
జిల్లాల్లో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 7.5 కే రన్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టుల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్ది సేపు సరదాగా బ్యాటింగ్ చేశారు. మావల పార్కులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఎస్పీ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధాపరిమళ, డీఐఎస్వో వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీపీఆర్వో భీం కుమార్ ఉన్నారు.
- ఆదిలాబాద్, వెలుగు
వజ్రోత్సవాలకు భీం మనుమడు
జైనూర్,వెలుగు: హైదరాబాద్‌లో జరిగే స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమానికి రావాలని కుమ్రంభీం మనుమడు కుమ్ర సోనేరావుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందింది. ఆదివారం సిర్పూర్(యు) తహసీల్దార్ రహమాన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. వజ్రోత్సవాల సందర్భంగా ఆదివాసీ అమర వీరుడికి అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందని సోనేరావు చెప్పారు. కార్యక్రమంలో పంగిడి సర్పంచ్ ఆత్రం జలీంషా, కొడుకు మాధవ్ రావు, ఆత్రం వినాయక రావు, రాజా తదితరులు ఉన్నారు.