
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పెనుబల్లి, వెలుగు : గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీకి క్లీన్‌చిట్ ఇవ్వొద్దని ఎన్‌హెచ్ ఆఫీసర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేను ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం పరిశీలించారు.
పెనుబల్లి మండలం సీతారామపురం ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆఫీసర్లు, రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 99 శాతం పనులు పూర్తయ్యాయని, కాంట్రాక్ట్ ఏజెన్సీకి క్లీన్ చిట్ ఇచ్చి, సమస్యలను వదిలేసి చేతులు దులుపుకుంటే సరిపోదని భవిష్యత్‌లో సమస్యలు రాకుండా పరిష్కారం చూపాలని సూచించారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సమాంతరంగా పొలాల్లోకి వెళ్లేందుకు 15 అడుగుల వెడల్పుతో దారిని నిర్మించాల్సిన బాధ్యత ఎన్‌హెచ్ ఆఫీసర్లదేనని స్పష్టం చేశారు. రైతులకు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, నాయకులు మట్టా దయానంద్, తహసీల్దార్ శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.